Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతి వ్యక్తిలో అంతర్లీనంగా ఏదో ఒక కళ దాగివుంటుంది. అయితే ఒకే వ్యక్తి విభిన్న రంగాల్లో, సాహిత్య రూపాల్లో తనదైన ముద్ర వేసి చివరి వరకు రాయడం కొందరిలోనే చూస్తాం. ఆ కొందరిలో ఒకరు, కథ, కవిత్వం, గేయం, పద్యం, నాటక రచన, విమర్శ, బాల సాహిత్యం వంటి రంగాల్లో సమానమైన ప్రతిభతో వెలిగిన రచయిత రేగులపాటి కిషన్‌రావు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన వీరు ఎక్కువ కాలం గ్రామీల ప్రాంతాల్లో పనిచేశారు. పనిచేసిన ప్రతిచోట ప్రతిభావంతులుగా వెలిగారు.
రేగులపాటి కిషన్‌రావు జనవరి 12, 1946న నేటి సిరిసిల్ల జిల్లాలోని మానేరు తీర గ్రామం చింతల్ ఠానాలో పుట్టారు. చంద్రమ్మ, భూంరావు వీరి తల్లితండ్రులు. రేగులపాటి కిషన్‌రావు దాదాపు ఆరు దశాబ్దాలు రచనలు చేశారు. వీరి శ్రీమతి రేగులపాటి విజయలక్ష్మి కూడా ప్రముఖ తెలంగాణ కథా రచయిత్రి కావడం విశేషం. వీరు ముప్పైకి పైగా రచనలు చేయగా అందులో బాల సాహిత్యం కాకుండా ఆరు నవలలు, ఆరు కథా సంపుటాలు, 13 కవితా సంపుటాలు ఉన్నాయి. 'ఈ తరం కథలు', 'స్వామీజీ కథలు', 'కథక చక్రవర్తి', 'సంస్కారం', 'ఈ తరం పెళ్ళి కూతురు' కథా సంపుటాలు. 'ఆమె వితంతువు కాదు', 'పతివ్రత ఎవరు', 'వాణిశ్రీ', 'సంఘర్షణ', 'ప్రేమకు పెళ్లి ఎప్పుడు' రేగులపాటి రచించిన నవలలు. రచనకు పేరు పెట్టడంలోనే రచయితగా ఆయన దృక్పథం. సంస్కారణావాదం వంటివి చూడొచ్చు. వీరి పన్నెండు కవితా సంపుటులు, పాటల సంపుటుల్లో 'ప్రగతి పాటలు', 'కవితా పుష్పాలు', 'కొత్త పాటలు', 'మల్లెమొగ్గలు', 'రవిబింబం', 'పాడవే కోయిలా..', 'కలం-బలం', 'మన ధర్మం', 'కాంతి పుంజం', 'గెలుపొందిన పావురం', 'ప్రగతి రథం' వంటివి ఉన్నాయి. రేగులపాటి కిషన్‌రావు వ్యాసకర్తగా, విమర్శకులుగా కూడా పరిచితులు. 'అక్షర సౌజన్యం' వీరి వ్యాస సంపుటి.
1979ని ఐక్యరాజ్య సమితి 'అంతర్జా తీయ బాలల సంవత్సరం'గా ప్రకటిం చింది. నటరాజ కళానికేతన్ ఎల్లారెడ్డిపేట శాఖ తమ బాధ్యతగా నలుగురు యువ కవుల రచనలతో 'ఈ తరం పాటలు' ప్రచురించింది. నలిమెల భాస్కర్, (జన సూర్య), వేముల సత్యనారాయణ, ఎర్రోజు సత్యం, రేగులపాటి కిషన్‌రావు ఆ నలు గురు. 'ఈనాటి సాహిత్యంలో పిల్లలకు సంబంధించింది చాలా తక్కువ. ఉన్న దాంట్లో ఎక్కువ భాగం వాస్తవాల్ని వక్రీక రించేవి, సమాజం పట్ల కనీసం అవగా హనను కలిగించనివీ, అబద్దాలని పని గట్టుకుని ప్రచారం చేస్తున్నవీ వున్నాయి' కాబట్టి వాటన్నిటినీ ఎత్తి చూపడమే కాక పిల్లలకు చక్కని సాహిత్యాన్ని అందిం చాలన్న దిశగా ఈ గేయ సంకలనం తెచ్చినట్టు ఈ యువ కవులు చెప్పుకు న్నారు. ఈ పుస్తకాన్ని '...ఈ వ్యవస్థ వివిధ విధాల రాక్షస దోపిడీకి బలవుతూన్న పసివాళ్ళకు అంతర్జాతీయ బాలల సంవత్సర సందర్భంగా' అంకింతం చేయడం విశేషం.
ఇలా అన్ని సాహిత్య ప్రక్రియలు, రూపాల్లో ప్రతిభావంతులుగా వెలిగిన రేగులపాటి కిషన్‌రావు కొన్ని అనువాదాలు కూదా చేశారు. నాటకాలు రాశారు. అన్ని ప్రక్రియల్లాగానే బాల సాహిత్యాన్ని అంతే ప్రేమగా సృజన చేశారు. ఎనభయ్యవ దశకంలో సిరిసిల్ల ప్రాంతంలో ఆయన సమకాలీనులైన ఎర్రోజు సత్యంతో పాటు వీరు ప్రధానంగా కనిపిస్తారు. బాలల కోసం రేగులపాటి గేయాలు, పాటలు, పొడుపు కథల వంటివి రాశారు. వీరి బాలల రచనల్లో మొదటగా కనిపించేది 'మల్లె మొగ్గలు'. ఇందులోని 'భాష', 'జేజేలు', 'లక్ష్యం', 'ఆట-పాట' వంటి గేయాలు పిల్లలకు ఆనందాన్ని పంచేవిగా ఉన్నాయి. ప్రతి గేయంలో పిల్లలకోసం సత్యం, ధర్మం, న్యాయం, నీతి, నిజాయితీ వంటివి బోధిస్తారాయన. దాదాపు అన్ని తెలుగు పత్రికల్లోనూ వీరి వందలాది గేయాలు వచ్చాయి. ప్రతి గేయం ప్రతిని నాకు ఆయన పోస్టులో పంపేవారు. 'చెలిమి'లో 'చేయి చేయి కలిపి/పదం పదం కలిపి/ పాడుదమా / ఆటలాడుదమా' అంటూ కలిసిమెలిసి ఆడే ఆటపాటలను గురించి చెబితే, మరోచోట 'నట్టనడిమి అడవిలో / మడుగు ఒకటి ఉన్నది / ఆ మడుగున మకరి / పీత నెయ్యముతో ఉన్నవి' అని రాసారు. గేయాన్ని అలతి అలతి పదాలతో రాయడం అనే విద్య బాగా తెలుసు. అందుకు ఆయన అన్ని గేయాలు ఉదాహరణగా నిలుస్తాయి. 'కొత్త పాటలు' వీరి మరో గేయ సంపుటి. ఇందులో గేయాలతో పాటు పొడుపు కథలు ఉన్నాయి. 1988లో వచ్చిందీ పుస్తకం. 'మేలుకొమ్ము మేలుకొమ్ము/ పూజచేయ వచ్చినాము/ అభిమానం ఆప్యాయత/ కలవారు రండి, రండి' గేయంతో పాటు, ఎవరు నీవు, ఎవరు నేను' గేయాలలో పొడుపు విడుపులను చూడవచ్చు. 'చెడు చెంతకు చేరవద్దు/ పరుల కీడు కోరవద్దు', 'తేనెలొలుకు పాటలన్ని వినిపిద్దాం' వంటి చక్కని పదాలు వీరి గేయాల్లో చూడవచ్చు. ఇతర ప్రక్రియల్లో అందరికోసం రాసినట్టే పిల్లలకోసం వారి స్థాయికి ఎదిగి చక్కని గేయాలను, పొడుపు కథలను, కవితలను రాసిన బాల సాహితీమూర్తి, మానేరు తీరపు బాల సాహిత్య కీర్తి స్వర్గీయ రేగులపాటి కిషన్ రావు.
- డా|| పత్తిపాక మోహన్, 9966229548