Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ ప్రపంచంలో జీవిస్తూ మనం ఏర్పరుచుకునే అనుబంధాల పట్ల స్త్రీ పురుషుల వైఖరిలో కొంత భిన్నత్వం ఉండి తీరుతుంది. ముఖ్యంగా స్త్రీ తాను ఏర్పరుచుకునే బంధాల నుంచి ఓ నిశ్చింత, భద్రతను కోరుకుంటుంది. అది ఆమెలోని ఆధారపడే తత్వం అని అనుకుంటే పొరపాటు. తాను ఎవరి దగ్గర నిర్భయంగా, ఏ దిగులు లేకుండా, ఏ నిరోధాలు లేకుండా జీవించగలదో ఆ వ్యక్తి పట్ల ఓ గొప్ప నమ్మకం ఏర్పరుచుకుంటుంది స్త్రీ. అదే ఆమెకు ఓ నిశ్చింతనిస్తుంది. జీవితంలో ఇలాంటి భద్రత కోసమే స్త్రీ పురుషుడి అధికారాన్ని కూడా కొన్ని సార్లు ఒప్పుకుంటుంది. స్త్రీ పురుష సంబంధాలలో ఈ భద్రత స్త్రీ పొందాలనుకునే ప్రేమలో అతి ముఖ్యమైనది. తండ్రి నుంచి, భర్త నుంచి, స్నేహితుని నుంచి కూడా ఆమె ఆశించేది అదే. ఆత్మవిశ్వాసంతో జీవించాలనుకునే స్త్రీలో ఈ కోరిక ఇంకా ఎక్కువగా ఉంటుంది. తనకు కొంత నిశ్చింత కలిగించే సంబంధం పట్ల ఆమె సంపూర్ణమైన నిబద్దత కలిగి జీవిస్తుంది. కొందరు స్త్రీలు ఈ భద్రతను ఆర్ధిక విషయాల వరకు మాత్రమే పరిమితం చేస్తారు. కాని పరిపక్వత కలిగిన స్త్రీ, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం ఉన్న స్త్రీ అర్ధిక భద్రత ఒక్కదాని కోసమే పురుషునితో బంధాన్ని నిర్మించుకోదు. అంతకు మించిన మానసిక స్థైర్యం, అనుబంధం ఆమె అతని నుంచి ఆశిస్తుంది. ఆ భద్రతను అనుభవించిన స్త్రీ ఆర్ధికమైన అవసరాలకు లొంగి ఉండలేదు. అటువంటి ఓ స్త్రీ కథతో 1990లో తమిళ భాషలో ''పుదు వసంతం'' అనే సినిమా వచ్చింది. విక్రమన్ దీనికి దర్శకులు. ఆయనకి ఇది మొదటి సినిమా. ఇందులో నటించిన వారందరూ సినీ జగత్తులో అప్పుడు కొత్తగా వచ్చిన వారే. ముఖ్యపాత్రలో నటించిన సితారకు ఈ సినిమా మంచి పేరు తీసుకువచ్చింది.
నలుగురు సంగీత ప్రియులు, సంగీత జగత్తులో తమ స్థానం ఏర్పరుచు కోవడానికి మద్రాసు చేరతారు. కలిసి ఓ టీం గా ఏర్పడి చిన్న చిన్న ప్రోగ్రాములు చేసుకుంటూ ఓ చిన్న గదిలో కలిసి ఉంటారు. ఖర్చుల కోసం రోడ్డు పక్కన కూడా కచేరీలు చేసుకుంటూ జనం ఇచ్చే డబ్బుతో ఆ నగరంలో తమ భవిష్యత్తు నిర్మించుకోవడానికి కష్టపడుతూ ఉంటారు. వీరికి మద్రాసు నగరానికి కొత్తగా వచ్చిన గౌరి అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఒంటరిగా నగరానికి వచ్చిన ఈమె కలవాలను కుంటున్న కుటుంబం మద్రాసులో అప్పుడు ఉండట్లేదని తెలిసి ఆమెకు ఎక్కడికి వెళ్లాలో అర్ధం కాని పరిస్థితులలో వీరి ఇంట్లో ఉండవలసి వస్తుంది. ముందు ఆమె మూగదని వీరు భావిస్తారు. ఆమెకు ఆశ్రయం ఇస్తారు. మెల్లిగా గౌరి వీరి జీవితంలో భాగం అవుతుంది. ఓ స్త్రీగా నలుగురి మగవారి మధ్యన ఏ మాత్రం ఇబ్బంది పడకుండా జీవించే వెసులుబాటును ఈ నలుగురూ ఆమెకు కలిపిస్తారు. ఆమె మూగది కాదని వారికి తెలిసిన తరువాత కూడా ఆమెతో అంతే స్నేహంగా ఉంటారు. ముఖ్యంగా తమలో ఒకరిగా ఆమెను అన్నిటిలో భాగం చేస్తారు.
ఆ ఇంట్లో తనకు తోచిన పనులు చేస్తూ ఆమె వారికి సహాయ పడుతూ ఉంటుంది. గౌరి ఓ ధనవంతురాలని, ఆమె తండ్రి మరణం తరువాత అతని మిత్రుడు కూతురు వరసైన గౌరిని బలవంతంగా వివాహం చేసుకుని ఆమె ఆస్థిని హస్తగతం చేసుకోవాలనుకోవడంతో గౌరి తాను ప్రేమించిన సురేష్‌ని వెతుక్కుంటూ ఒక్కతే మద్రాసు నగరం వస్తుంది. సురేష్ లండన్ వెళ్లిన కారణంగా అతని కోసం ఎదురుచూస్తూ ఉండడం తప్ప ఆమెకు మరో దారి ఉండదు. ఇంత పెద్ద నగరంలో ఆ నలుగురి స్నేహం ఆమెలో అంతులేని బలాన్ని, జీవితం పట్ల నమ్మకాన్ని కలిగిస్తాయి. అందుకే వారితో కలిసి ఉండిపోవడానికి ఆమె సిద్ధ పడుతుంది. నలుగురు మగవారితో ఆమె కలిసి ఉండడం వల్ల వీధిలోవారు ఆమె గురించి తప్పుగా మాట్లాడుకోవడం విని గౌరిని ఆ నలుగురు హస్టల్లో చేరుస్తారు. కాని ఆమె ఇంట్లో లేని వెలితి వారిని బాధపెడుతుంది. గౌరి కూడా వీరి స్నేహాన్ని వదిలి విడిగా హాస్టల్లో ఉండలేకపోతుంది. చివరకు వీరి దగ్గరకే వచ్చేస్తుంది. తన మంచితనంతో పక్క ఇళ్లవారికి దగ్గరవుతుంది.
గౌరి తన పాత పరిచయాలను ఉపయోగిం చుకుని ఈ నలుగురికి ఓ పెద్ద సంగీత పోటీలో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ లోగా సురేష్ లండన్ నుంచి వస్తాడు. అతన్ని కలవడానికి గౌరితో ఆ నలుగురు కూడా ఏయిర్‌పోర్ట్‌కి వెళతారు. కాని నలుగురు మగవారితో గౌరిని చూసిన సురేష్ వారితో సరిగ్గా మాట్లాడడు. గౌరిని అక్కడి నుంచి తన ఇంటికి తీసుకుని వెళతాడు. గౌరీ సురేష్‌ల వివాహం నిశ్చయమవుతుంది. అయితే దీని కన్నా ముందు సురేష్ గౌరీ జ్వరాన్ని అడ్డంపెట్టుకుని ఆమెను లేడీ డాక్టర్ దగ్గరకు తీసుకువెళతాడు. ఆమె కన్యగా ఉందో లేదో పరీక్ష చేయిస్తాడు. గౌరీ కన్యత్వాన్ని పోగొట్టుకోలేదని డాక్టర్ సురేష్ తో చెప్పడం గౌరి వింటుంది. అతనిలోని ఈ కోణాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోతుంది.
సంగీత పోటీకి గౌరి తప్పకుండా రావాలని ఆ నలుగురు కోరుకుంటారు. ఆమెకు ఆ సంగతి చెప్పడానికి గౌరి దగ్గరకు వెళతారు. సురేష్ గౌరీ ముందే వారిని అవమానించి ఇంకెప్పుడు గౌరీని కలవవద్దని వారికి చెప్తాడు. గౌరిని వదిలి దుఖంతో, అవమానంతో తిరిగి వెళ్లిపోతారు ఆ మిత్రులు. సంగీత పోటీలు జరుగుతున్న సమయంలో వీరు గౌరీ తమ మధ్య లేకపోవడాన్ని జీర్ణించుకోలేక బాధపడుతూ ఉంటారు. స్టేజి పైకి వెళ్ళలేక పోతారు. అప్పుడు గౌరీ హాలులోకి వచ్చి కూర్చుంటుంది. ఆమె ముందు చాలా సంతోషంగా పాడతారు వారు. తాను సురేష్‌ని వదిలి వచ్చేశానని, తనను నమ్మలేని ఆ ప్రియుడిని, అతనితో జీవితాన్ని వదిలి ఈ స్నేహితులతో ఓ స్నేహితురాలిగా ఉండి పోవడానికి తాను తిరిగి వచ్చానని చెబుతుంది గౌరి.
ఇల్లు వదిలి ప్రేమ కోసం సురేష్‌ను వెతుక్కుంటూ వచ్చిన గౌరి ఎంత బాధను అనుభవించి ఉంటుందో సురేష్ అర్ధం చేసుకునే ప్రయత్నం చేయడు. పైగా ఆ పరిస్థితులలో ఓ ఆస్తిపరుడిగా తాను పెళ్ళి చేసుకుని ఆమెకు కొత్త జీవితాన్ని ఇస్తున్నాననే అహం అతనిలో ఉంటుంది. గౌరి కోసం కూడా అతను ఆమె స్నేహితులను స్వీకరించలేకపోతాడు. పైగా తనతో జీవితం కావాలంటే గౌరి ఈ స్నేహితులని మరచిపోవాలని షరతు పెడతాడు. వీటన్నిటికన్నా ముందు ఆమె కన్యగానే ఉందో లేదో తెలుసుకోవాలని ఆమెకు పరీక్ష చేయిస్తాడు. ప్రేమించినందుకు గౌరి జీవితంపై అతను పెత్తనం చెలాయించడం తన హక్కుగా భావిస్తాడు. ఆమె మనసు ఏమి కోరుకుంటుందో అతను పట్టించుకోడు. పైగా ఆమె తాను అనుకుంటున్నట్లు జీవించాలని, ఆమె ఇష్టాలపై, ఆమె స్నేహాలపై తన పూర్తి నియంత్రణ ఉండాలని అనుకుంటాడు.
నిస్సహాయ పరిస్థితులలో తమ వద్దకు వచ్చిన గౌరిని ఆ స్నేహితులిందరూ ఎంతో గౌరవంతో తమ మధ్య చోటు ఇస్తారు. ఆమె బాగు కోసం కలిసి కష్టపడతారు. తమ వద్ద డబ్బు లేకపోయినా గౌరి చిన్న చిన్న కోరికలు తీర్చడానికి కలిసి ఆలోచిస్తారు. ఆమెకు తమ ఇంటిపై నిర్ణయాధికారం ఇస్తూ ఆమె నిర్ణయాలను గౌరవిస్తారు. తమ జీవితంలోని ప్రణాళికలను ఆమెతో చర్చిస్తారు. ఆమెను తమలో ఒకరిగా చూసుకుంటారు. వారి మధ్య గౌరికి దొరికిన ప్రేమ, గౌరవం, ఆమెలో అంతులేని ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. డబ్బులో పుట్టి పెరిగిన ఆమె ఆ చిన్న గదిలో వారితో కలిసి జీవించడంలో కూడా ఆత్మీయతను అనుభవిస్తుంది. ముఖ్యంగా తాను ఓ స్త్రీని అని, ఆ నలుగురు స్నేహితులు పురుషులు అనే సంకోచాన్ని ఆమె ఎప్పుడూ అనుభవించదు. అంతగా ఆమెకు ఆ ఇంట్లో భద్రత ఉంటుంది. కాని ధనవంతుడైన సురేష్‌తో ఆమె గడిపిన ఆ కొన్ని రోజులు కూడా, తన మనసును చంపుకుని జీవిస్తుంది. అతని ఇంట్లోని వైభవం, భవిష్యత్తులో అతని భార్యగా తాను అనుభవించే ఆ ఆస్థిపాస్తులు కూడా ఆమెకు అంతకు ముందున్న నిశ్చింతతను కలిగించలేవని ఆమె అర్ధం చేసుకుంటుంది. అందుకే ప్రేమ కన్నా స్నేహం గొప్పదని భార్య అనే స్థానం కన్నా ఆ పేదవారి స్నేహితురాలిగా ఉండిపోవడంలో తనకు ఆనందం ఉందని ఆమె నిర్ణయించుకుని సురేష్ వద్దనుకుని స్నేహితుల వద్దకు వచ్చేస్తుంది.
గౌరీ తీసుకున్న నిర్ణయం గురించి చాలా చర్చించుకోవచ్చు. అందమైన భవిష్యత్తు, ఆర్ధిక భద్రత, సమాజంలో స్థానం ఇవన్నీ వదిలి కేవలం ఓ నలుగురు స్నేహితుల కోసం గౌరీ వచ్చేయడం ఎంత వరకు సమంజసం. ఆ నలుగురిలో ఏ ఒక్కరితోనూ ఆమె కలిసి జీవించాలనో, వివాహం చేసుకోవాలనో అనుకోదు. ఆమెకు వారు స్నేహితులు మాత్రమే. తరువాత వారి వారి జీవితాలలో స్థిరపడినప్పుడు ఇదే స్నేహం వారందరికి సాధ్యమవుతుందా లాంటి కొన్ని ప్రాక్టికల్ విషయాలను కూడా పరిగణంలోకి తీసుకున్నప్పుడు గౌరీ నిర్ణయం సరినదేనా అని చాలా మందికి అనిపించవచ్చు.
సురేష్ ప్రేమలోని నిజాయితీని ఈ నలుగురి స్నేహంతో పోల్చుకున్నప్పుడు గౌరికి సురేష్ వ్యక్తిత్వంలోని లోపాలు అర్ధం అవుతాయి. అతనితో తన భవిష్యత్తు ఆనందంగా ఉండదని ఆమె నిర్ణయించుకుంటుంది. అందుకని అతన్ని వదిలి తిరిగి స్నేహితుల వద్దకు చేరుతుంది ఆమె. స్నేహంలోని భద్రత తనకు సురేష్‌తో ప్రేమ, పెళ్ళి ఇవ్వలేవని, ఏ బంధంలో అయినా తాను ఆశిస్తుంది ఓ గౌరవాన్ని, పరస్పర నమ్మకాన్ని అన్నది ఆమెకు స్పష్టం అవుతుంది. అవి దొరకనప్పుడు ఆ ప్రేమను భద్రత కోసం స్వీకరించలేనని ఆమె నిర్ణయించుకోవడం ఈ సినిమాలో చర్చకు వచ్చే ముఖ్యమైన పాయింట్. స్త్రీ పురుష సంబంధాలలో స్త్రీ ఏం ఆశిస్తుందో చెప్పడం ఈ కథ ఉద్దేశం. తరువాత గౌరీ జీవితం ఏ మలుపన్నా తీసుకోవచ్చు. కాని పరిపూర్ణమైన స్నేహాన్ని వివాహం అనే బలవంతపు బంధం కోసం వదులుకోలేని వ్యక్తిత్వం గౌరిది. తనను గౌరవించలేని ప్రియిని కన్నా తనలోని ఆత్మవిశ్వాసాన్ని హరించే భార్య పదవి కన్నా ఓ స్నేహితురాలిగా మిగిలి పోవడంలోనే ఆనందం ఉందనుకునే అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న స్త్రీ గౌరి.
ఈ సినిమాకు రాష్ట్ర స్థాయిలోనూ ఫిల్మ్ఫేర్లోనూ అవార్డులు లభించాయి. ఈ సినిమా పాటలు చాలా హిట్ అయ్యాయి. దీన్ని తెలుగులో ''నవ వసంతం'' పేరుతో డబ్ చేసారు కూడా. ఇదే సినిమాను కన్నడలో 'శృతి' అనే పేరుతో హిందీలో ''బహారో కె మంజిల్'' పేరుతో రీమేక్ చేశారు. గౌరీగా సితార మంచి పర్మామెన్స్ ఇచ్చారు. బాలు గా మురళి, మైఖెల్ గా ఆనంద్ బాబు, రాజా గా రాజా, మనోహర్ గా చార్లీ వారి పాత్రలకు న్యాయం చేశారు. ఓ మంచి సినిమాగా ''పుదు వసంతం'' తమిళ సినిమా చరిత్రలో గుర్తుండిపోతుంది.
- పి.జ్యోతి, 9885384740