Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎవలకైనా ఎక్కన్నైనా నోరే మనిషిని కరాబు చేస్తది. అదుపుతప్పి మాట్లాడితే తిప్పలే ఉంటది. ప్రేమతో మాట్లాడితే స్నేహం పెరుగుతది. కసిరిచ్చుకుంట మాట్లాడితే 'వీడేందిరో ఇట్లా' అనిపిస్తంది. సమాజంలో మాటే మంత్రం తను ఎలాంటివాడో తెలిపేది నోరు మాత్రమే. ఈ ఊరు మంచిదేనా అని ఎవరినైనా అడిగితే 'నోరు మంచిదైతే ఊరు మంచిది అయితది' అనే సామెత పుట్టింది. అట్లనే నోరు అదుపుల పెట్టుకోవాలె ఎట్ల పడితే అట్ల మాట్లాడవద్దు అని తెలిపే సామెత ఇది. నిజంగా నోరుతో ఏది పడితే అది ఎట్ల పడితే అట్లనే తింటే కూడా ఆరోగ్యానికి హానికరం. రుచి బాగున్నదని నూనె పదార్థాలు చక్కెర వస్తువులు లాగిస్తే వైద్యుని దగ్గరకి వెళ్ళాల్సిందే.
'ఊరన్నకాడ ఊరపందితోని కూడ అక్కెర' అనే సామెత. ఊరు సమిష్టి ప్రజలందరి అవసరాలు పరస్పరం తీర్చుకునే మాట్లాడుకునే సందర్భం. ఊరిలో ఎవలితోనైనా ఏదో అవసరం ఉంటది. ఒగలకు నిచ్చెన కావాలి ఇంకొకరికి ఉపకారి కావాలి మరొకరికి పాతాళ గరిగె కావాలి ఇట్లా అప్పుడప్పుడు అవసరం ఉండె ఇసిరెలు అందరి ఇండ్లలో ఉండవు కావున ఊరన్నకాడ అందరితోని అవసరం ఉంటది అనేది చెప్పేందుకు ఊర పంది తోని కూడా అవసరం ఉంటదని చెప్పటం. ఊరపంది అంటే ఊరరు మీద తిరిగే పందుల గుంపులు ఉండేటివి. బహుశ ఇప్పుడు పందులు పెంచుతలేరు అనుకుంట. అందరితోని అవసరం ఉన్నదనే విషయాన్ని తెలిపేది ఈ సామెత. అట్లనే 'నలుగురితోని నారాయణ' అనే సామెత కూడా ఉన్నది. అంటే నలుగురు ఎట్ల అంటే అట్ల అనాలి అన్నట్టు. కొన్ని సామెతలు శాస్త్రీయంగా ఉండవు. కాలానికి అనుగుణంగా వచ్చిన సామెతలు ఎప్పటికి అప్పుడే అన్వయించుకోవాలి.
- అన్నవరం దేవేందర్, 9440763479