Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'రాల్లకుచ్చె' తెలంగాణ సీమ, పల్లె హృదయాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన కథా సంపుటి శీర్షికగా దాసరి మోహన్ 17 కథలు ప్రచురింపజేశారు. ఊరు ఇడ్సిపెట్టి నగరంలో సంపన్నుడైనా, చిన్నతనంలో ఊరి మొదట్ల వున్న రాల్లకుచ్చె జ్ఞాపకాలు కరీంనగర్ యాసలో సాగిన ఈ కథ చదువరులను కదిలిస్తుంది. 'జీవితం కొనసాగించాల్సిందే' కథలో రమేష్, ఉమల స్థానంలో కిరణ్, లక్ష్మిల కలయికగా కథను రచయిత మలుపు తిప్పారు. అమ్మకు సేవ చేయకుండా ప్రజలు సేవ చేస్తున్నానని గొప్పలు చెప్పుకోవడం మంచిది కాదనే వ్యక్తీకరణతో తల్లిని జాగ్రత్తగా చూసుకొనే పాత్రను 'అమ్మసేవ' కథలో సృష్టించారు. సంసార రేఖలు దాటి వెళ్లి విజేత అయిన 'మానస', కిడ్నీయిచ్చిన 'పని శ్రీమంతురాలు'వంటి అరుదైన పాత్రలు రచయిత సృష్టించారు. 'మిడిల్ క్లాస్ అమ్మాయి' అనిత, తన పెళ్లి విషయంలో సాధించిన విజయం కట్నాల పీడతో సతమతవయ్యే యువతులకు మార్గదర్శకంగా వుంది. భార్యాభర్తల సంసారిక జీవనంలో భర్తగా పురుషాధిక్యతతో భార్యను అవమానించే వ్యక్తిత్వం వున్న భర్తకు గుణపాఠం 'కాలం తీర్పు' చెప్తుంది. 'కౌచ్ గాళ్లు' కథలో సమాజంలో అన్ని రంగాలలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై ఉద్యమ ఆవశ్యకత స్పష్టం చేస్తోంది. 'మాతృభాషను ఆదరించడం, ఆచరించడం ఇంటి నుంచే మొదలవ్వాలి' సందేశాన్ని 'తెలుగు అత్త - ఇంగ్లీష్ కోడలు' కథ సందేశాత్మకంగా వివరిస్తుంది. చిన్న కుందేలు పట్ల కూడా కారుణ్యం చూపించలేని మనుషుల కఠినత్వం పట్ల తల్లి కుందేలు దేవున్ని ప్రశ్నించడం, 'సీన్ రిక్రియేషన్' కథ తెలియ చేస్తుంది.
ప్రతీ కథలోను నిత్యజీవిత అనుభవాలను, వర్తమాన సమాజంలోని వ్యక్తుల తీరుతెన్నులను రచయిత ప్రతిబింబింప చేసారు. కథ ముగింపు కొస మెరుపుగా, ఒకటి రెండు వాక్యాలలో చమత్కారంగా అది అంతే అన్నట్టు అతి సహజంగా ముగించడం విశేషాంశం. దాసరి మోహన్ కథా సంపుటి 'రాల్లకుచ్చె' సామాజిక ప్రయోజనం ఆశించే చక్కని కథల సమాహారం. రచయిత అభినందనీయులు.
రాల్లకుచ్చె (కథా సంపుటి)
రచయిత : దాసరి మోహన్,
పేజీలు : 110, వెల : రూ. 150/-,
ప్రతులకు : దాసరి మోహన్,
ఇ.నెం. 9-110-50/1, గాయత్రీ నగర్,
బోడుప్పల్, మేడ్చల్ జిల్లా - 092;
నవచేతన పబ్లిషింగ్ హౌస్,
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.
- జయసూర్య
సెల్ : 9985309080