Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిద్ధిపేట బాల సాహిత్యానికి, సాహితీ వేత్తలకు ప్రసిద్ధి పేట... పెట్టని కోట. తొలి తరం నుంచి నేటి వరకు వంద మందికి పైగా బాల సాహితీ వేత్తలు ఇక్కడి నుంచి వచ్చారు. ఈ తరంలో సిద్ధిపేట నుంచి బాల సాహిత్యంలో రాణిస్తున్న వారిలో కవి, రచయిత, ఉపాధ్యాయుడు, బాల సాహితీవేత్త, బాల సాహిత్య కార్యమ్రాలకు ముందు వరుసలో నిలిచే కార్యకర్త ఉండ్రాల రాజేశం ఒకరు. సిద్ధిపేట కేంద్రంగా జరిగే ప్రతి సాహిత్య సాంస్కృతిక కార్యక్రమానికి తలలో నాలికలా ఉండే రాజేశం అనేక సంస్థలకు ముందూ, వెనకా నలిచాడు కూడా. అవేకాక ప్రతి నెల సిద్ధిపేట వేదికగా 'ప్రతినెల బాల సాహిత్య కార్యక్రమం' పేరుతో సిద్ధిపేటలో కార్యక్రమాల నిర్వహణకు ముందుండి నేతృత్వం వహిస్తున్నారు.
నేటి సిద్ధిపేట జిల్లా నారా యణరావుపేట మండలంలోని గుర్రాలగొంది గ్రామంలో మే 5, 1978లో పుట్టారు. తల్లిదం డ్రులు వజ్రమ్మ, రాజ మల్లయ్య. బాల్యం, విద్యాభ్యాసం స్వగ్రామంలో జరు గగా ఉన్నత విద్య సిద్ధిపేటలో పూర్త య్యింది. దేశభక్తి, జాతీయవాద భావనా స్రవంతితో రచనలు చేసే రాజేశం జాతీయ సాహిత్య పరిషత్, సిద్ధిపేట ప్రధాన కార్యదర్శిగా, తెలంగాణ జాగృతి, సాహిత్య విభాగం సిద్ధిపేట బాధ్యుడుగా ఉన్నారు. తెలుగు పండితునిగా మెదక్ జిల్లా హవేళి ఘణపూర్లో ఉద్యోగం చేస్తున్న వీరు పద్యం, గేయం, కథ, వచన కవిత్వం, వ్యాసం వంటి వివిధ ప్రక్రియల్లో రచనలు చేస్తున్నారు.
2009లో సాహిత్య రంగంలో ప్రవే శించిన రాజేశం 'ఊహా రేఖలు', 'చెరువు' కవితా సంపుటాలు, 'ఆక్రందన' నానీల సంపుటాలు ప్రచురించాడు. అన్ని తెలుగు పత్రికల్లో రాజేశం బాలల కథలు, గేయా లతో పాటు కవిత్వం, కథలు అచ్చ య్యాయి. యిటీవల బాల సాహిత్యంపై వ్యాసాలు, రచనలు చేస్తున్న వారిలో రాజేశం ఒకరు. రచయితగానే కాక సంపాదకునిగా పిల్లల రచనలు సంకలనం చేసి సిద్ధిపేట జిల్లా బాల కవుల రచనలు 'అక్షర కాంతులు' పేర తెచ్చారు. వీరి మరో సంకలనం 'కూడవెళ్ళి రామలింగే శ్వర స్వామి చరిత్ర' కవితా సంపుటి. గేయం, వచన కవిత, కథలతో పాటు పద్యవిద్యలోనూ ఉండ్రాల నిష్ణాతులు. వందలాది పద్యాలు రాశారు. వివిధ సంకల నాల్లో వీరి పద్యాలు వచ్చాయి. త్వరలోనే వీరి 'భావి పౌరులారా' శతకం అచ్చులోకి రానుంది. బాల సాహిత్య రచనా వికాసంలో చేస్తున్న సేవలకు వివిధ సంస్థల నుంచి పలు పురస్కారాలు, సత్కారాలను వీరు అందు కున్నారు. వాటిలో కేంద్ర సాహిత్య అకా డమి అవార్డు గ్రహీత వాసాల నర్సయ్య బాల సాహిత్య పురస్కారం, బాలగోకులం 'బాల ప్రియ' పురస్కారం, డా.చింతోజు బ్రహ్మయ్య-బాలమణి బాల సాహిత్య పురస్కారం' వంటివి వాటిలో ఉన్నాయి.
బాల సాహిత్య రచనా రంగంలోకి ప్రవేశించిన తక్కువ కాలంలోనే 500కు పైగా పిల్లల కథలు రాశారు. పిల్లలకు నచ్చే విధంగా జంతువులు ప్రధాన పాత్ర లుగా చేసుకొని, చిన్న చిన్న అంశాలను కథగా రాసారు రాజేశం. బడి, ఇల్లు, వాడ, ఆట, స్నేహం, గ్రంథాలయం, ఊరు, ఎన్ఆర్ఐలు ఇలా ప్రతి అంశాన్ని బాలల నేపథ్యంలో చూసి రాస్తారు. వీరి కథల్లో నీతితో పాటు స్ఫూర్తి కలిగించే అనేక విషయాలు ఉంటాయి. ఇటీవల వచ్చిన 'స్ఫూర్తి' కథ అటువంటి స్ఫూర్తి నింపేదే. పూర్వ విద్యార్థులు బడికి చేయాల్సిన సేవలను ఇందులో ఆయన చెబుతారు. ఉండ్రాల తొలి బాల సాహిత్య ప్రచురణ 'పంచదార గుళికలు' గేయ సంపుటి, 2012లో ప్రచురించారు. తరువాత 'బాల కథా మంజరి', 'బాల కథా దీపిక', 'బంధు ప్రీతి', 'బాల కథా కౌముది' పేర్లతో బాలల కథా సంపుటాలు తెచ్చాడు.
పద్య విద్య తెలిసిన రాజేశం బాలల గేయాలను అంతే సుందరంగా రాస్తాడు. అంతే స్ఫూర్తిని కూడ తన గేయాలతో కలిపిస్తాడు. 'ఆటలు ఆడే చిన్నోడా!/ ఓడి పోయావని బెంగేలా!/ గెలుపు ఓటములు సహజమురా' అంటూ చెబుతూనే, ప్రకృతి పట్ల ప్రేమతో పిల్లలను 'చెట్లను గుంపుగ పెంచాలి / ప్రకృతిని రక్షించాలి' అంటూ పిలుపు నిస్తారు. 'బాలలం మేం బాలలం / ఆడి పాడే బుడుగులం / సెలవు రోజు కలిశాము / దాగుడు మూతలు ఆడాము / పరుగులు పదనిస చేశాము / గుజ్జనగూళ్ళు కట్టాము / కొమ్మల పందిరి వేశాము / బొమ్మలు పెట్టి కొలిశాము / కమ్మని పాటలు పాడాము / బొమ్మకు చెప్పి మురిశాము' అంటూ బాలల ఆటపాటలను వర్ణించిన రాజేశం, తెలంగాణ పెద్ద పండుగ బతుకమ్మ, బొడ్డమ్మలను బాలల కోసం వర్ణిస్తూ, 'నెత్తిన బుట్ట పెట్టుకొని/ పుట్టమన్ను తవ్వుకుని/ బొడ్డెమ్మ తల్లిని పేర్చేద్దాము', 'గునుగు తంగెడు చామంతులతో / సద్దుల బతుకమ్మ పెద్దగా పేర్చి/ బంధుగణముతో బతుకమ్మలాడి/ సిరులి వ్వాలని సాగనంపుదము' అంటారు. రచయితగా, కవిగా, బాల సాహిత్య వికాస కార్యకర్తగా బాలల కోసం పనిచేస్తున్న ఉండ్రాల రాజేశం సిద్ధిపేట బాల సాహిత్య వెలుగుల్లో ఒకరు. జయహో! బాల సాహిత్యం.
- డా|| పత్తిపాక మోహన్, 9966229548