Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తొంభై ఆమడలైన వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలని వెనుకటి నానుడి. అంతటి విశిష్టతను సంతరించుకున్న ఈ తోలు బొమ్మలాట ఈ తరం వారికి అసలు తెలియదు అంటే ఆశ్చర్య పోనక్కర్లేదు.
సినిమాలు, టీవీలు రావడంతో తోలుబొమ్మలాట కొంత మరుగున పడితే, సెల్ఫోన్ల రాకతో సామాజిక మాధ్యమాల ఒరవడిలో ఒక్క తోలుబొమ్మలాటే కాదు, అన్ని లలిత కళల పరిస్థితి మరీ దిగజారిపోయింది.
కొత్తొక వింత, పాతొక రోత అంటారు ఒకప్పుడు రాజ దర్పం ప్రదర్శించిన కళలు నేడు వన్నె కోల్పోయి దయనీయ స్థితికి చేరుకున్నాయి. గతంలో ఓ వెలుగు వెలిగిన ఎన్నో కళలు నేడు ఆదరణ తగ్గి, మసకబారిపోయాయి. అలాంటి వాటిలో ఈ తోలుబొమ్మలాట ఒకటి. ఏ సన్నివేశాన్నయినా బొమ్మల రూపంలో మన కళ్లకు కట్టినట్టు చూపించేదే ఈ కదిలే బొమ్మల కథ 'తోలుబొమ్మలాట'
సాహిత్యం, సంగీతం, హాస్య చతురత, చిత్రం, శిల్ప కళలన్నీ కలగలిపిన కళ ఏదంటే ఒక్క తోలుబొమ్మలాటలోనే అది సాధ్యం. లలిత కళలన్నిటిలోనూ ఈ ప్రదర్శనం ఎంతో కన్నుల పండుగగా వుండడమే కాదు, తీసుకున్న కథా వస్తువును బట్టి కడుపుబ్బా నవ్విస్తుంది కూడా.
తెర వెనుక వున్న కళాకారులు తమ చేతులతో బొమ్మలకున్న తాళ్ళను ఎంతో చాకచక్యంగా కదిలిస్తూ, చక్కగా నాట్యం, పాత్రాభినయం చేయిస్తారు.
తెరమీది బొమ్మలు ఎంత వేగంగా హావభావాలతో, కదం తొక్కుతూ నాట్యం చేస్తాయో, తెర వెనుక ఆ తోలుబొమ్మల్ని ఆడించే వ్యక్తులు కూడా అంతే హుషారుగా డైలాగులు చెప్తూ, పద్యాలు పాడుతూ తమ హావభావాల్ని పలికిస్తుంటారు. అయితే అవేమీ తెర ముందు ప్రదర్శన చూస్తున్న ప్రేక్షకులకు కనిపించవు. మరి తెర వెనుక ఈ హోమ్‌వర్క్ అంతా ఎవరు చేస్తారంటే.... ఆ తోలుబొమ్మలాట ప్రదర్శించే వ్యక్తి కుటుంబ సభ్యులే. ఆ కుటుంబంలో ఎంత మంది సభ్యులుంటే... భర్త, భార్య, పిల్లలు, తాత, అమ్మమ్మ, నానమ్మ... ఇలా అందరూ ప్రదర్శనలో భాగస్వాములే. బొమ్మల్ని తయారు చేసేదీ వారే, ప్రదర్శించేదీ వారే. నేడు మనం మల్టీ టాస్క్ అంటున్నాం కానీ, అప్పట్లోనే వీరు మల్టీ టాస్కర్స్. చేతుల్తో, కాళ్ళతో బొమ్మలకున్న తాళ్ళను కదిలిస్తూ బొమ్మల్ని కథకు అనుగుణంగా నాట్యం చేయిస్తూ, పాడుతూ, వాయిద్యాలు (అవసరమైన శబ్దాలుచేస్తూ) వాయిస్తూ బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించేవారు.
ఈ తోలుబొమ్మలాట ప్రదర్శించడానికి తెర వెనుక కనీసం ఏడుగురు సభ్యులు అవసరమవుతారు. ఒక్కోసారి ఒక్క వ్యక్తే రెండు మూడు పాత్రల బొమ్మల్ని కూడా ఆడిస్తుంటాడు. తోలుబొమ్మలను సంగీత వాయిద్యాలకు అనుగుణంగా కదిలిస్తూ, పురాణ గాథలను రస రమ్యంగా వివరిస్తారు.
ముఖ్యంగా వీరు ప్రదర్శించే కథా వస్తువులు... భారత రామాయణ గాథలకు సంబంధించిన లంకాదహనం, మైరావణ చరిత్ర, ఇంద్రజిత్తు వధ, యయాతి కథ, కీచక వధ, దుశ్శాసన కథ, ప్రహ్లాద చరిత్ర, పల్నాటి వీర చరిత్ర వంటి పురాణాలు, చరిత్ర ఇతివృత్తాలు.
ఈ ప్రదర్శనలో ఉపయోగించే తోలుబొమ్మలు మార్కెట్లో ఎక్కడా దొరకవు. ఈ తోలుబొమ్మలాట ప్రదర్శించే కళాకారులే వీటిని స్వయంగా తయారు చేసుకుంటారు. కథకు తగ్గట్టుగా ఎప్పుడు ఏ బొమ్మ అవసరమవుతుందో గుర్తించి, కళాకారుల బృందంలోనివారే మేక, జింక, దుప్పి చర్మంతో తయారు చేసుకుంటారు. కథలో వచ్చే ఉద్దాత్త పాత్రలైన రాముడు, కృష్ణుడు, విష్ణువు, ఇంద్రుడు, దేవతలు, సీత, సావిత్రి, ద్రౌపది మొదలైన పాత్ర లన్నింటికీ జింక చర్మాన్ని; రాక్షస, దుష్ట పాత్రలు, మిగిలిన చిల్లర పాత్రలకు మేక చర్మాన్ని ఉపయోగిస్తారు. ముందుగా చర్మాలను సేకరించి వాటిని శుద్ధి చేసి, చర్మానికి వుండే దుర్వాసన పోగొడతారు. కావలసిన బొమ్మల సైజును గీసుకుని, చక్కగా కత్తిరించి, పాత్ర ఔచిత్యాన్ని బట్టే రంగుల్ని అద్దుతారు. ఈ రంగులు కూడా సహజ సిద్ధంగా దొరికే బంక, దీపం మసి, మోదుగ చెట్టు ఆకులు, పూలనే ఉపయోగిస్తారు.
ఎంచుకున్న కథా వస్తువుకు తగ్గట్టుగా ప్రదర్శనానికి కావలసిన అన్ని పరికరాలను సిద్ధం చేసుకుంటారు. సన్నివేశాలకు తగ్గట్టుగా ఒక బొమ్మ తరువాత మరొక బొమ్మను తెరమీదీకి ఎక్కించి కథను రక్తి కట్టిస్తారు. ఈ ప్రదర్శనలో బొమ్మల్ని ఆడించే వ్యక్తులు ఎంత ముఖ్యమో, దీపాల కాంతి తగ్గకుండా ఆముదం పోస్తూ, దీపం ఒత్తులు సరిచేసే వ్యక్తి ప్రాధాన్యత కూడా అంతే ముఖ్యం. దీపాల కాంతి తగ్గితే బొమ్మల అందచందాలు తగ్గడమే కాదు, వాటి హావభావాలు కూడా సరిగా కనిపించవు మరి. ఈ ప్రదర్శనలో ఇంకో ముఖ్యమైన విషయం... ఈ ప్రదర్శన సమయంలో బొమ్మలు ఆడించే ప్రతి ఒక్కరికీ పరస్పర సహకారం తప్పనిసరి. లేదంటే ఆటంతా అబాసుపాలే. అందుకే సినిమాకు దర్శకుడు ఎంత ముఖ్యమో ఈ ఆటకు సూత్రదారుడు కూడా అంతే. వాయిద్యగాళ్ళను, బొమ్మల్ని ఆడించేవాళ్ళందరికీ సమయ పాలనను సూచిస్తూ, అందరినీ ఒక తాటిపై నడిపే బాధ్యత ఈ సూత్రధారిదే. అన్నట్టు మన సినిమాల్లో ఒకప్పటి బ్రహ్మానందం, సుధాకర్ లాగా, ఇప్పటి జబర్దస్ట్ కమెడీ ఆర్టిస్టుల్లాగా తోలుబొమ్మలాటలో కూడా కేతిగాడు, పోలిగాడు, బంగారక్క వుండేవారు. ఆ పాత్రల ద్వారా హాస్యాన్నే కాదు, శృంగారాన్ని పండించేవారు.
ఈ బొమ్మల్ని ప్రదర్శనలో కాకుండా మిగతా సమయాల్లో చూస్తే.... ఏదో తోళ్ళ ముక్కల్లాగ, సంచుల్లాగా చాలా చిన్నగా కనిపిస్తాయి. వీటిని తెరమీద, దీపాల వెలుగులో చూస్తే పెద్దగా, నిలువెత్తు మనిషిలా కనిపించి, వాటి అందం, రమణీయత ప్రేక్షకుడికి తెలుస్తుంది.
తోలుబొమ్మల కళాకారులు ఈ బొమ్మల్ని ఎంతో జాగ్రత్తగా ఒక్కో బొమ్మని ఒక్కో చెక్క పెట్టెలో భద్రపరిచే విధానం చూస్తే చాలా ఆశ్యర్యమేస్తుంది! ఈ కంపు కొట్టే తోలు సంచులకి ఇంత జాగ్రత్త అవసరమా అనుకుంటారు సామాన్య జనం. కానీ ఆ బొమ్మల విలువ ఆడించే కళాకారుడికి మాత్రమే తెలుసు. అందుకే అంత జాగ్రత్త!!
ఎద్దుల బండ్లపై ఊరూరూ తిరుగుతూ ప్రదర్శనలు ఇస్తుంటారు వీరు. గ్రామ పెద్దలు, రైతులు, మోతుబరులు ఇచ్చే ధాన్యంతో వీరి జీవనం సాగేది. ఊరి బయటో, ఏ గుడి దగ్గరో విశాలమైన ప్రదేశం చూసుకుని గ్రామ పెద్ద అనుమతితో ప్రదర్శనకు ఏర్పాటు చేసుకుంటారు ప్రదర్శకులు. ఊళ్ళో 'ఈ రోజు తోలుబొమ్మలాట వుందహో...' అని దండోరా వేయిస్తారు. చిన్నా పెద్దా, పిల్లా పాల అందరూ రాత్రి పెందళాడే తిని బొమ్మలాటకు సిద్ధమవుతారు. కానీ గ్రామ పెద్ద, ఊరి పెద్ద, కరణం, మునసబు రానిదే ఆట మొదలవ్వదు. దానికోసం మిగతా జనం పడిగాపులు పడి, విసుక్కోడాలు, తిట్టుకోడాలు అన్నీ అయ్యాక తీరిగ్గా విఘ్నేశ్వరుని పూజతో బొమ్మలాట ప్రారంభమవుతుంది. అప్పటి వరకు వున్న విసుగంతా మాయమై, ఆటలో ఎప్పుడెప్పుడు కేతిగాడు వస్తాడా, బంగారక్క వస్తుందా ఎదురు చూసిన వారికి వారి రాకతో కడుపుబ్బా నవ్వులే నవ్వులు.
ఇంత జనరంజకంగా సాగిన ఈ తోలుబమ్మలాట చరిత్ర క్రీ.శ. మూడో శతాబ్దానికే చెందినది. ఈ తోలుబొమ్మలాటకు చెందిన కళాకారులు మొదట్లో మహరాష్ట్ర నుండి ఆరె కాపులుగా వలస వచ్చారని, వారి నుండే దక్షిణ ప్రాంతాలకు ఈ ఆట వ్యాపించిందని చెప్తుంటారు. ఒక్క దక్షిణ రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తర భారతదేశంలో కూడా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో ఈ తోలుబొమ్మలాట విస్తరించింది. అయితే మిగతా జానపద కళల్లాగే ఈ తోలుబొమ్మలాట కూడా నేడు కనుమరుగయింది. మనం మరిచిపోయిన ఈ కళను గుర్తు చేసేందుకు.. సంప్రదాయ కళను కళ్లకు కట్టేందుకు.. ఈ కదిలే బొమ్మలాట జ్ఞాపకాలే మార్చి 21వ తేదీని 'తోలుబొమ్మలాట దినోత్సవం'గా జరుపుకుంటున్నాం.
- బి. మల్లేశ్వరి