Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక్కొక్కరు ఒక్కో రంగంలో నిష్ణాతులు అవడం మనం చూస్తున్నాం. అనేక మంది తెలంగాణ రచయితలు వాళ్ళ వాళ్ళ రంగాల్లో అంచుల్ని ముట్టారు. సృజన చేస్తున్నారు. మరికొందరు వివిధ రంగాల్లో తమదైన ముద్రను వేస్తున్నారు. అలాంటి వారిలో పద్యం, గేయం, కథ, బాల సాహిత్యంతో పాటు చిత్రలేఖనంలో ప్రతిభను కనబరిచి నిలిచిన సిద్దిపేటకు చెందిన గృహలక్ష్మి శ్రీమతి ఎడ్ల లక్ష్మి. ఎడ్ల లక్ష్మి నేటి సిద్ధిపేట జిల్లా దూలిమిట్టలో ఆగస్టు 8, 1956న వ్యవసాయ కుటుంబంలో పుట్టింది. తల్లితండ్రులు శ్రీమతి గునుగుల లక్ష్మీనరసమ్మ- శ్రీ నారాయణ రెడ్డి. స్వగ్రామంతో పాటు హైదరాబాద్లోని మాడపాటి హనుమంతారావు బాలికల పాఠశాలలో పదవ తరగతి వరకు చదువుకుంది. వివాహానంతరం ఆసక్తితో కుట్టు శిక్షణలో లోయర్, హయ్యర్ గ్రేడ్ పాసై కొంత కాలం కుట్టు శిక్షణ కేంద్రాన్ని నిర్వహించింది. స్వతహాగా ఉన్న పఠనాసక్తికి భర్త భూమిరెడ్డి ప్రోత్సాహంతో రచనా రంగంవైపు మళ్ళింది.
గృహిణిగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే సాహితీ రంగంలోకి ప్రవేశించి దశాబ్ది కాలంలో పదికి పైగా రచనలు అచ్చు వేసింది. మరో పది పుస్తకాలు అచ్చుకు సిద్ధంగా ఉండడం వీరి రచనా వికాసానికి నిదర్శనం. దాదాపు రెండు వేలకు పైగా బాలల గేయాలు, అయిదు వందల కవితలు, వేలాది మాత్రాఛందో మణిపూసలు, బాలల కథలు ఈ అమ్మ ఖాతాలో ఉన్నాయి. పద్యాన్ని అత్యంత ప్రేమగా రాసే ఎడ్ల లక్ష్మి తేట తెలుగు నుడికారంతో, ఆట వెలది ఛందస్సులో రామాయణాన్ని లలిత సుందరంగా రాసింది. 'బాలకాండ', 'అయోధ్య కాండ' పూర్తయ్యాయి. ఇప్పుడు అరణ్యకాండ, సుందరకాండ రచనలో ఉన్నాయి.
'నీరాజనం' మంగళ హారతి పాటలు రాసి అచ్చువేశారు. కథా రచయిత్రిగా తాను రాసిన కథలను 'సిద్ధిపేట సిరిమల్లెలు' పేరుతో ప్రచురించారు. మణి పూసలు కవితా రూపంలో కరోనా కాలాన్ని, అప్పటి ధైన్యాన్ని కవిత్వం చేసి 'కరుణలేని కరోనా'గా అచ్చులోకి తెచ్చారు. బాల సాహిత్యంలో కాయిత్రిగానే కాక చిత్రకారిణిగా కూడా ఎడ్ల లక్ష్మి పరిచితులు. తాను రాసిన గేయాలకు స్వయంగా తానే చిత్రాలు గీయడం విశేషం. అలా వీరి అన్ని బాలల గేయ సంపుటాలు, మణిపూసల సంకలనాలు, కథా సంకలనంలో వీరి బమ్మలే మనకు కనిపిస్తాయి.
చిరకాలంలోనే విశేష రచనలు చేసిన వీరు పలు సత్కారాలు పురస్కారాలు అందుకున్నారు. వాటిలో 'సహస్రవాణి', 'శత గాన కోకిల'తో పాటు ప్రపంచ మాతృదినోత్సవ పురస్కారం, విబాస్ ఉగాది పురస్కారం, తెలుగు రక్షణ వేదిక ఉగాది పురస్కారం, ఆదర్శ మహిళ పురస్కారం, పెందోట బాల సాహిత్య పురస్కారం, బిఎస్ రాములు స్ఫూర్తి పురస్కారం, లంబోధర ఉగాధి పురస్కారం, లాంతర్ అవార్డు, తెలుగు సాహిత్య కళా పీఠం పురస్కారంతో పాటు 'మెతుకు సీమ మొల్ల'గా బిరుదు అందుకున్నారు.
బాల సాహితీ వేత్తగా లక్ష్మి రాసిన గేయ సంపుటాల్లో 'కనుపాప', 'బంగారు బంగరం', 'కొమ్మల్లో కోకిల', 'చలాకీపిల్లలు' ప్రసిద్ధాలు. పిల్లల కోసం రాసిన మణిపూసలు 'దశావతారాలు', 'కౌశికుని చరిత్ర' పుస్తకాలు. అచ్చయిన గేయాలకంటే అచ్చుకానివే ఎడ్ల లక్ష్మి వద్ద కోకొల్లలుగా ఉన్నాయి. వీరి పిల్లల కథలు ఎంత ఆసక్తిని రేకెత్తించేవిగా ఉంటాయో, గేయాలు అంతే అందంగా ఉంటాయి. 'ఎనుగమ్మ ఏనుగు / చిన్న గున్న ఏనుగు' మొదలుకుని అనేక పక్షలు, సంతువులు, పిల్లలు వీరి పాటల్లో మనం చూడవచ్చు. కాకి-నీళ్ళ కడవ కథ మనకు తెలుసు, దానిని ఎడ్ల లక్ష్మి మరింత గమ్మత్తుగా చెబుతూ మన పెరటి చెట్టు మీద ఆ కాకి ఉందని రాస్తారు. 'రామ రామ అంటాది / రామచిలుక / రాగాలు తీస్తాది / రామచిలుక', 'పల్లె పల్లె తిరిగినావు / పాలపిట్ట / మా పల్లె కొచ్చినావు / పాలపిట్ట' అంటూరు. మనకు కనిపించే పందికొక్కును కూడా గేయం చేశారీ అమ్మ, 'పందికొక్కు పందికొక్కు / పారిపోయావా!' అంటూ రాస్తారా గేయంలో. ఇలాంటివే వీరి 'వచ్చాడమ్మా వచ్చాడు / బమ్మల తాత వచ్చాడు', 'గట్టుమీద కప్పపిల్ల / కలం పట్టెను / కలం పట్టిన కప్పపిల్ల /కథలు రాసెను' గేయాలు. బంగారు బంగురంలో 'వీరులాడె బంగురం / వీరనారి బంగురం / ఆటలెన్నో ఆడినాది / పాటీలలో గెలిచినాది' అంటారు. ఎడ్ల లక్ష్మిది కర్శక కుటుంబం, వ్యవసాయ నేపథ్యం. అవన్నీ ఆవిడ గేయాల్లోనూ, బమ్మల్లోనూ అడుగడుగున, అక్షరమక్షరంలో మనకు కనిపిస్తాయి. అ మట్టి స్పర్శనే వారి బమ్మలకు అందం కూడా. 'ఎర్రెర్రని బువ్వ పెట్టుకుని/ పుల్లని కూర కలుపుకుని' రైతు తాత తింటాడని రాస్తారీవిడ. తాను పుట్టిన పల్లెను, పరిసరాలను, జీవితాలను బాలల కోసం రచనలుగా అందిస్తున్న సిద్ధిపేట బాల సాహిత్యపు వెలుగు, కవితల బమ్మల కాణాచి శ్రీమతి ఎడ్ల లక్ష్మమ్మకు అభినందనలు. జయహో! బాల సాహిత్యం.
- డా|| పత్తిపాక మోహన్, 9966229548