Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొందరు ఊహాలోకంలో విహరిస్తారు. పగటి కలలు కన్నట్టు పెళ్ళికాక ముందే కొడుకు పేరు ఏం పెట్టాలననే ఆలోచన చేస్తారు. ముందుచూపు ఉండాల్సిందే కాని పెళ్ళిచూపులు కూడా కాలేదు పెళ్ళీ కాలేదు, అయిన తర్వాత భార్య గర్భవతీ కాలేదు కొడుకు పేరు సోమలింగం అని ఒక ఊహ. ఇలాంటి మరీ చాదస్తపు ముందుచూపు వున్నవాళ్ళను 'ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం' అన్నట్టు అని అంటారు. ఊరి సామెతల్లోనూ కవిత్వం వుంటది. పదాల మద్య ప్రాస వుంటది. దాంతోనే ఆ సామెత తరతరాల్లో మనందరికి జ్ఞాపకం వుంటది. ఒక్క సామెత ప్రస్తావిస్తే విషయం అంతా అర్థం అవుతుంది.
కొంతమందికి జ్ఞాపకం తక్కువ. ఆదుర్ద ఎక్కువ. చేతులనే వస్తువు పట్టుకుంటరు ఎక్కడ ఎక్కడ అని వెతుకుతుంటరు. ఇంట్లో తను పెట్టిన వస్తువు తనకు దొరకదు. ఇలాంటి వారిని 'చంకలో పిల్లను పెట్టుకుని ఊరంత వెదికినట్టు' అని అంటరు. పూర్వకాలంలో పిల్లలను ఆడుకునేందుకు అలా వాకిట్లోకి వదిలేసేవారు. ఇప్పటి అంత అపురూపం ఉండక పొయ్యేది. వాకిట్లోని పిల్లలు ఆడుకుని ఆడుకుని అంబాడి ఇంట్లోకన్నా వస్తరు. అయితే ఆ తల్లి ఇంట్లో పనులల్లో నిమగమయి వుండి మనుసులో పిల్ల ఎటుపాయె అనే తపనతో వుంటది. ఒక్కోసారి బిడ్డను ఎత్తుకుని కూడా ఎటుపోయింది అంటూ ఊరంతా తిరగడం ఇదీ ఈ సామెత వెనుక కథ.
ఊరి భాష వేరు చదువుల భాష వేరు. పల్లెటూరి భాష పట్నం షోకుల భాషకు కాస్త తేడా వుంటది. ఊర్లల్ల ఊరి పల్లె భాష మాట్లాడిన వాల్లే ఇంకోసారి ఇంకో భాష మాట్లాడతరు. కొంత కల్పించి శానిక మాట్లాడతరు. ఇట్లాంటోలు 'చదువుకోక ముందు కాకరకాయ చదువుకున్నంక కీకరకాయ' అన్నరట. నేను చదువుకున్న కదా కాకరకాయలను గుడిదీర్ఘం పెట్టి కీకర అంటే మరింత మంచిగ వున్నది అనుకుని కీకరకాయ అన్నారట. ఊరి సామెతల్లో వ్యంగ్యం వుంటది హాస్యం వుంటది.
- అన్నవరం దేవేందర్, 9440763479