Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాపటికి మబ్బు పట్టిన మొగులు
ఏ పూటకి పగిలిపోతుందో
ఏ పగటి వరకు మిగిలిపోతుందో
ఉలుకు పలుకులను నడిపించే నాడీ మీద
ఏ కత్తుల నాదమో వినిపిస్తున్నట్టున్నది
మడిమ తిప్పాలన్న మెడ తిప్పాలన్న
అనుమానమొక్కటే ముందు జాగ్రత్తకు మందైతున్నట్టున్నది
ఏ పూటకు ఏ పూట పొసగక
ఏ పాటీకి ఆ పాటి మార్పోక్కటే మార్గమైనట్టున్నది
ఏ భద్రతా లేని బుగులు గీతం పాడుతూ బతికీడుస్తున్నట్టున్నది
అడుగేస్తే అభద్రత, మాట్లాడితే ముందుచూపు
ఈ ముందస్తు ప్రణాళికల బ్రతుకుచిత్రం
భలే విచిత్రంగా విషపు ముళ్ళై గుచ్చుతున్నది
నడుస్తున్న వాడికి సత్తువలేదు
మాట్లాడుతున్న వాడికి నమ్మకం లేదు
విషాద వికత విన్యాసపు ఆంక్షల మధ్య
ఆశాగీతం పాడేదెట్లా? శాంతికపోతం ఎగిరేసేదెట్లా?
ఎంతైనా చెప్పు గాని
ఆరంభానికి ముగింపుకి అంటుగట్టుడెట్లా?
అంచనాలకు వంచనాలకు మధ్య
కాలం అమరిక ఏ పోలిక లేకుండా పోయింది
అకస్మాత్తుగా మాయమవుతున్న జీవితాలకు
మరమ్మత్తుగా మంత్రం వేసే మార్గమేమైనా ఉన్నాదా ?
- పి.సుష్మ