Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ దోపిడీ దొంగదొరల్లారా
అందరం ఏకమవుదాం రండి!
ఇన్నాళ్లూ ఇది అన్యాయం అని
ఎదురు తిరిగిన ప్రతి గొంతుకను
అణచి వేస్తూ మనల్ని కాపాడుతూ మన ఆసరాగా అండగా నిలిచిన అధికారం
మన నమ్మిన బంటై
కాపలా చౌకీదారుగా కాంట్రాక్టులు వ్యాపారాలను అడక్కుండానే
అప్పనంగా కట్టబెడుతుంటే
సిగ్గువిడిచి కాలరెగేసుకుంటూ
కలిసి నడుద్దాం రండి!
భయాన్ని వీడి బరితెగించి దేశాన్ని దోచుకుందాం పదండి!
మనం పంచిన నోట్ల ఎరకు
ఓట్లు చిక్కి ఎన్నికల జాతరలో గెలిచిన బూటకపు ప్రజాస్వామ్య అధికారం మన చేతి మరబొమ్మలై కదులుతున్నాయి!
చట్టం న్యాయం పోలీసులు
మనల్ని కాపాడే కవచాలు నేడు
ప్రజాస్వామ్య మూల స్తంభాలన్నీ
అవినీతి బంధుప్రీతి చెద సోకి కొనుక్కున్న మనకోసం నిలిచి కీర్తిస్తూనే ఉన్నాయి!
మనం కలిసి దోచుకునేందుకు
కావేవీ అనర్హం ఈనాడు!
నేల అడవి ఆకాశం నీరు నిప్పు
అంతటా మనమే అన్నిటా మనమే!
మట్టిని గుట్టలను తొలిచేసి ఖనిజాలను
అక్రమంగా అదుపు లేకుండా తవ్వుకోవచ్చు అమ్ముకోవచ్చు!
అడ్డొచ్చిన అడవి బిడ్డల్ని
ఆగం చేస్తూ అక్రమ పోడు ఎగుసం నెపంతో జైళ్లలో నెట్టి భూముల్ని లాక్కొని అడవుల్ని ఆక్రమించవచ్చు!
జాతినిధుల గనులైన
ప్రజల ఆస్థులు నవరత్నాలనెపుడో
స్వాహా చేయగలిగిన మనం
నేడు రైళ్ళను విమానాలను రహదారులను మన గుప్పిట బిగించి
దేశ సంపదను మన బొక్కసాల్లోకి
కుక్కేందుకు కదిలి రండి!
మట్టిని నమ్మి అన్నం మెతుకులను పండించే రైతన్నల బ్రతుకులను రోడ్ల పాల్చేసినా మనల్ని ఇనుప కంచెలతో కాపాడిన ఘన రాజ్యంలో మనమే
నిర్ణేతలమై సామాన్యుడికి అందకుండా గూడు, కూడును దూరంచేస్తూ
దేవుళ్ళను మతాలను విద్వేషాలను
మనిషి మెదళ్ళలో ఇంజక్ట్ చేస్తూ
వైద్యం విద్య వ్యాపార సరుకులుగా
అంగట్లో అమ్మకానికి పెడుతూ ప్రపంచ కుబేరులతో పోటీపడుతూ
దోపిడీ పరుగులో మున్ముందుకు
పోదాం పోదాం పైపైకి!
అమాయక జనాలు పిల్లుల్లా
ఉన్నంతవరకే మన ఆటలని
తిరగబడి పులులై గాండ్రిస్తే
ఎలుగెత్తి పిడికిలి బిగిస్తే
ఆనవాళ్లు కూడా అందక
పేకమేడల్లా కూలిపోక తప్పదని
చరిత్ర చెబుతున్న 'మేడే'
సత్యమిదేనని మాత్రం మరవద్దు!
(30 ఏప్రిల్ శ్రీశ్రీ జయంతి స్మరిస్తూ)
- డా|| కె.దివాకరాచారి, 9391018972