Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేటి ప్రేమికుల హృదయం
చాలా లోతైనది
కానీ దాన్నిండా విషమే వున్నది
మొన్న పరిచయం నిన్న ప్రేమ
నేడు పెళ్ళి రేపే పెటాకులు
ఇవే కదా నేటి ప్రేమకు భాష్యాలు
ప్రేమంటే ఆడతనంపై మగతనం గెలుపు కాదు
పరస్పర త్యాగం
అమ్మాయిల్ని వేధించడమంటే
పాత్రల్ని పగులగొట్టుకుని
రసం వొలకబోసుకోవడమే
సీతాకోక రెక్కలు తెంపి
బలిపీఠాన్ని అలంకరించడంలో
ఔచిత్యమేముంది
ఆమె కలల్ని కర్తిరించి
నీ కళ్ళకు తోరణాలుగా చేసుకోవడంలో
ఆనందమేముంది
కన్నీళ్ళతో తడిసి ముద్దయి
స్వేచ్ఛగా ఎగరలేని సీతాకోకలు
నీ హృదయంలో శృంగార పతాకాల్ని
ఎలా ఎగరేయ గలవు
ఆమె స్వేచ్ఛగా విహరించినప్పుడే కదా
పురి విప్పిన నెమలిలా మనసును
దేహం కదలికల్లో ఆవిష్కరిస్తుంది
సీతాకోకచిలుకై రంగుల వాన కురిపిస్తుంది
అందులో తడిసి ముద్దయి తరించినప్పుడే
నీ మగతనం గెలుపునకు
ఆమె క్షేత్రమై నిన్ను గెలిపిస్తుంది
ఆమె దేహాకృతి ప్రకృతికి సమానం
కామాత్మకంగా కాదు కళాత్మకంగా దర్శించు
అడవుల్ని నరికి కొండల్ని ధ్వంసం చేసినట్లు
ఆమెలో చొరబడి చేసే నీ విధ్వంసాన్ని ఆపు
ఏ యుద్ధంలోనైనా నువ్వు గెలవాలంటే
ఎదుటి పక్షాన్ని ఓడించు
ఇక్కడ నువ్వు గెలవాలంటే మాత్రం
ముందు ఆమెను గెలిపించు
తన కళ్ళముందరే అక్కలెందరో
ప్రేమకు శిలువెయ్యబడటం చూసి
నేడు పెద్దమనిషైన ప్రతి ఆడపిల్ల
పెద్ద మనిషయ్యేదాకా
బతికే నమ్మిక లేక కాబోలు
పెళ్ళి కలకు ముందే చావు కలగంటుంది
యువకులూ! జాగ్రత్త
రేపు మీరు, ఆలి లేని అనాథలు కావచ్చు
- ఏబూషి నర్సింహ, 9542806804