Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ట్రిమ్మింగ్ చేసిన మొక్కల్లా
వీల్లెంత ఒద్దికగా ఉన్నారు.!?
దారం పట్టి నాటు పెట్టిన వరినారులా
వీళ్లెంత క్రమశిక్షణగా ఉన్నారూ..!?
పరీక్ష నాలికల్లో మొలకెత్తిస్తున్న అంకురాల్లా
ఎంత పారదర్శకంగా ఉన్నారూ ..
వీళ్ళు గాజు సీసాల్లో ఒదిగిన రంగుల దశ్యపటాలే
ఉన్న దానికన్నా మరింత మెరిసిపోతున్నారు..!
వీళ్ళు చెంగున దుంకే బుజ్జి ల్యాగలు కదా
ఇంత పద్ధతిగా ఉన్నాయంటే
వీళ్ళ మెడలకి కనబడని లెంకపీటలేవో
వేలాడ కట్టినట్టున్నారు..!
ఈ బుడ్డోళ్ళని..
ఉరుములు మెరుపులు చిచ్చరపిడుగులూ,
దూకుడు పిల్లలూ అని కదా కీర్తిస్తూఉంటాం ..!
ఇప్పుడు మాత్రం
గంప కింది కోడి పిల్లల్లా బుద్ధిమంతులే..
కొండ అంచుల్లోంచి రాలిపడే ఈ జలపాతాలనీ,
కోన గుండెల్లోంచి ఎగిసిపడే ఈ సెలయేరులని
'స్టాప్ డోంటాక్' అన్నారెవరో..
ఉన్నపళంగా ఆగి, అదోరకం ముచ్చట గొల్పుతున్నారు..
గుడ్డు పెంకులోంచి
తొంగిచూస్తున్న ఈ బుడ్డోడు 'సచిన్'
ఎంత ముద్దొస్తున్నాడో వీడిప్పుడు ఐదోదే ..
రేపు ఆర్మీ పాయిలెట్ అవుతాట్ట..!
'కొమ్మా ఉయ్యాలా.. కోనా జంపాలా'..అంటూ నన్నేదో
ట్రాన్స్ లోకి తీసుకెళ్లాడు..!
బాలల హక్కులూ,
స్వేచ్చా పక్షులంటూ స్పీచులిస్తావుగా..
వీళ్ళని చూడు.. ఎంత అందంగా అణకువగా
చెప్పినట్టు వింటున్నారో నంటూ.. నన్నాడిపోసుకుంటోంది
నా బడి దోస్త్ .!!
ఈకలు పీకి రెక్కలు కత్తిరించి పౌల్డ్రిఫాముల్లో పెంచితే..
బాల్యం విరబూస్తుందంటారా.!?
యేమో... యే ప్రయోగాలూ మరే తప్పతడుగులూ వేయకుండా
వాడు సజనకారుడు ఎట్లా
అవుతాడో నాకైతే అర్ధం కాలేదు..!
- నాంపల్లి సుజాత,
9848059893