Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భుజంపై తలాన్చి చంటిది
దారి పొడుగునా గడ్డిపరకను ముక్కున
కరచుకున్న పిచ్చుక కథను
బాల్కనీని తాకే చెట్టుకొమ్మలపై
తల్లి కాకి పసినోళ్ళకు అందించే
ప్రేమను గురించి
కూనలకు వీధిలో పాలు కుడిపే
కుక్కలోని అమ్మతనం గురించి
కోయిల పాటల గురించి
పావురం రెక్కల తపతపల గురించి
వీపుపై పర్వతాలను మోసే
చలిచీమల నడక గురించి చెబుతూనే ఉంది
ఊ కొడుతూనే ఉన్నాను
నిన్న గాక మొన్ననే కదా పుట్టింది చంటిది
దారి పొడుగునా పరిమళపు వానై కురుస్తూ
ఎన్ని మాటలకోటలు కట్టింది
ఎన్నెన్ని ఆకాశాలను చూపింది
మరెన్ని నక్షత్రాల మెరుపులను జేబులో పోసింది
మరెన్నో వెన్నెల నదులను పరిచయం చేసింది
సముద్రపు ఒడ్డుకు చేరగానే
అలలపాపాయిలా నవ్వింది
నీటిపూలను నాపై అల్లరల్లరిగా చల్లింది
ఇసుకలో నాకు ఇల్లు కట్టింది
నెమలై పరుగులు తీస్తూ
వేవేల రంగులలో నన్ను స్నానించి
పరిశుభ్రపరచింది
ఇప్పుడు నేను మచ్చల్లేని తెల్లకాగితంలా
వెలుగుతున్నాను
ఈ హడావిడి లోకాన్ని ఈదుతూ
ఇన్నాళ్ళూ సరిగ్గా గమనించలేదు కానీ
ఇప్పుడనిపిస్తోంది
నా భుజంపై ఉన్నది లేలేత కెరటాలతో
ఎగసిపడే అందమైన సముద్రమని
చూసే కొద్దీ మనసు చూపుతిప్పుకోలేనంత
అనంత సౌందర్యమని
- పద్మావతి రాంభక్త, 9966307777