Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ వారీష్ షా
నేను ఈ రోజు మీలా మారుబోతున్నాను!
మీరు పడుకున్న సమాధుల నుండి లేచి మాట్లాడండి
మీ ప్రేమ పుస్తకానికి మరొక పేజీని జతచేయండి..!
పంజాబ్‌లో ఒక కుమార్తెకు అన్యాయం జరిగిందని
మీరు కథలు కథలుగా విలాప గీతాలతో
కవిత్వం రాశారుగా...!
నేడు వందల మంది కుమారైలు ఆర్తనాదాలు చేస్తూ
మిమ్మల్ని వారిష్ షా అని పిలుస్తున్నారు.
లేవండి! ఓ దు:ఖంలో ఉన్న మిత్రమా ....!!
లేచి నీ పంజాబ్‌ను చూడు...!
పంజాబ్ పొలాల్లో గుట్టలుగా పడి ఉన్న శవాలను
చీనాబ్ నది కాషాయ రంగులో ప్రవహించడం చూడండి
ఎవరో రహస్యంగా పంచనదులలో విషాన్ని కలిపారట...
ఆ నీరే పంటపొలాలకు సాగునీరై పారగా
ఈ యుద్దభూమి నుండి విషపూరిత
కలుపుమొక్కలు మొలకెత్తాయి
ఎరుపు ఎంతో ఎత్తులో వ్యాపించి
శాపాన్ని ఆకాశంలో ఎగరేసింది.
విషపూరితమైన గాలి ప్రతీ అడవిగుండా వెళ్తూ...
వెదురు రెమ్మలను కూడా నాగుపాములుగా మార్చింది
మొదటి పాటను కూర్చిన వాడు విరుగుడును మరచిపోయాడేమో
ఆ కోరలు ప్రతీ చోట చేరి వారి పెదవులను కాటేశాయి
ఆ విషం పచ్చని అంతటా వ్యాపించి పంజాబ్ అంతా నీలం రంగులో మారిపోయింది.
ప్రతీ గొంతులోన స్వరం నలిపివేయబడింది.
స్నేహితులందరూ చెల్లా చెదురుగా పడివేయబడి
వారి జీవనాధార చేనేత నూలుచక్రం శబ్దం
క్రమ క్రమంగా జీరబోయింది.
పడవలన్ని తీరం మరచి
చుక్కాని లేకుండా నీటి అలలపై తేలుతున్నాయి
రావి కొమ్మ మీదుగా కట్టిన ఊయల రావి చెట్టునే కూల్చివేస్తుంది.
రాంజా సొదరులందరూ వేణువు వాయించడం మరచిపోయారట
ఈ నేలపై రక్తవర్షం కురుస్తోంది
సమాధులన్ని నెత్తుటితో నిండిపోయి
ప్రేమ యువరాణులు స్మశానంలో వారి ప్రియమైన వారికోసం
గుండెలు పగిలేలా రోధిస్తున్నారు
ఈ రోజు వారందరూ ప్రేమకోసం అందమైన దొంగలుగా మారారు
వారిష్ షా ....,!
ఈ చరిత్ర మూలాలను రాయడానికి
మళ్ళీ మీ వంటి వారు ఎక్కడ దొరుకుతారు?
వారిష్ షా...!
లేవండి! మీరు సమాధి నుండి లేచి మాట్లాడండి
మీ ప్రేమ పుస్తకానికి మరొక కొత్త పేజీని లిఖించండి...!!
- పద్మజ బొలిశెట్టి, 7981821620
మూలం : పంజాబ్ దిక్కార తొలి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత అమృతాప్రీతం
(ఇంగ్లీష్ నుండి అనువాదం తెలుగులోనికి)