Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆకాశం పై కప్పు కలిగిన ముఖద్వారం
ప్రవేశ ఉసుము లేకుండ
నన్ను తన లోనికి ఆహ్వానించింది
కొమ్మల స్వాగత తోరణాల సడి
పచ్చని భాషణలతో మురిపించింది
మనుషుల్ని మరో లోకం తీసుకెళ్ళే
పరిమళ ప్రాంతాల్ని
మనసుతీరా ఆఘ్రాణించమని
కొన్ని పూలు నా దోసిట చేరాయి
బుద్ధి జీవులైన మీ జ్ఞాన చరణాల క్రింద
మేం స్వర్గపుటంచులు చూస్తామని
రాలిన పూలు సెలవిచ్చాయి
బహు బలశాలిత్వాన్ని చూసి పొంగిపోక
వట వృక్షమంత నీడలు
నన్ను తోడ్కొని మనసును విస్తార పరిచి
స్వాంతన పొందమన్నవి
తమ చల్లని హృదయాలతో తీగబారి
తోటంతా కలియదిప్పుకున్నవి
చిన్నా పెద్దా తేడాలు చూపుకోక
గాలి దీవెనలతో వాటి కొమ్మలు
ఆకుల కంటి కొనుకుల నుండి
జారిపడిన చినుకుల తడితో
తరాల వారసత్వపు మాలిన్యాల్ని
మట్టిలో కలిపి
మనోదేహ భారాల్ని తేలిక పరిచినవి
దేశ దౌర్భాగ్యమంతా
కాల్చబడినట్లు తృప్తినొందాను
నిలువెల్లా పేరుకుపోయిన
వ్యక్తిగత, సామాజిక వైరస్ వేరియంట్లు
కక్షలు, కార్పణ్యాలు
వివక్షలు, అణచివేతలు
అసూయా ద్వేష పూరితాల్ని
కర్బన ద్వి ఆమ్లజనిగ తమలో దహింపజేసుకొని
భౌతిక, మానసిక దూరాల్ని పాటించమన్నవి
తాము సమర్పించిన
ఊపిరి సత్తువను తలకెత్తుకొని
కిరణ జన్య సంయోగ తత్వంతో
సమూహ క్షేమాన్ని ఊరేగించమన్నవి
స్వేచ్ఛా భావనల కాలర్ నెగరేస్తూ
మనిషి లోకపు మహోదయాల్ని కాంక్షిస్తూ
విశ్వ వికాసపు వేదికపై
మానవతా నర్తనంతో
ఉదయోల్లాసం దిక్కులనంటింది
ఈ పద ధ్వని మీ చెవిన మార్మోగాలంటే
ఒకసారి నేనాస్వాదించిన తోటలోకి
మీరూ అడుగిడండి... ఆవాహన పొందండి
- వనిపాకల లచ్చిరెడ్డి,9966897001