Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సింహం, జింక
సహజమైన, సుందరమైన
అడవిలో పక్కపక్కనే
చక్కగా వేటిపనిలో అవి
మునిగి ఉంటాయి.
ఎప్పుడైతే సింహానికి
ఆకలి వేస్తోందో
జింక పసిగట్టి పరుగెట్టడం...
సింహం వేటాడటం...
మొదలు పెడతాయి.
బలాబలాలను బట్టి
గెలుపు ఓటములుంటాయి.
పోతే
ఒకదానికి ఆకలి
రెండోదాని ప్రాణం పోవడం
లేకుంటే ఒకటి బతికిందా
రెండోది ఆకలితో చచ్చిందే...
ఇదే అడవి/ ఆకలి నీతి.
మరి మానవ నిర్మిత
కాంక్రీట్ కీకారణ్యంలో
కర మానవులెప్పుడూ
పులి తోలు, సింహం జూలు కప్పుకొని
వేరుగా.. వేరేగా.. ఉండరు.
అందరూ మనలానే
మామూలుగా సాదాసీదాగా
సహజంగా ఉంటారు
జింకలా నువ్వు ఎదుటి వ్యక్తి
ఆకలిని పసిగట్టగలవా?!!
అదేదైనా సరే
ఆకలిరూపాలు అనేక రకాలు
తీయని మాటల వెనక తూటాలు..
ముట్టిన చేతులలోని
కనిపించని శూలాలు..
ఆదరించినట్లే తోస్తూ
అగాధాలు తీస్తూ..
నువ్వుతూ మాట్లాడుతూ
నట్టేట్లోముంచేవారు..
నీ చుట్టుపక్కల ఉన్నారేమో
గ్రహించగలవా?
తిండీ తిప్పల్లో
చదువు సంధ్యల్లో ఆటపాటల్లో
ఆచారవ్యవహారాల్లో
సంస్కతి సంప్రదాయాల్లో
విలువలూ గౌరవాలల్లో
మార్కెట్, మీడియాలల్లో
ఇది అదని కాదు
అది ఇదని లేదు
రంగురంగుల ఆశలతో
రకరకాల మోసాలు
నేరాలు... ఘోరాలు...
నిన్నేం చేస్తున్నాయో
అంచనా వేయగలవా?
నిన్ను ముందుకు
తోసిన వారినీ...
నీ వెనక చెడుగా
మాట్లాడే వారినీ...
నీకు తప్పుడు సలహా
ఇచ్చేవారిని...
నిన్ను నిప్పుల్లో నిలిపేవారినీ...
నమ్మకుండా ఉండగలవా?
నీకు చెడు మార్గం చూపించి
నీ వెనక గోతులు తీసే వారిని...
నీ అడుగులకు మడుగులొత్తుతూ
నీ వెనక విమర్శించేవారిని...
గుర్తించగలవా?
ఇవేవి ఇక్కడ నేర్పరు.
కరిక్యులంలో కనిపించవు.
అమ్మానాన్నలు చెప్పే
కుటుంబ వ్యవస్థ కుంటిదైంది.
గద్దించి నేర్పించే
గురువు చేతి నుండి
బెత్తం లాక్కోబడింది
కెమెరా కన్నుల రాజ్యంలో
కీచకుల కిటకిట
నిత్యం ఎగురుతున్న
దుఃఖం బావుటా...
నానీ జాగ్రత్త
మాయావి లోకంలో
మకిలి మనుషుల స్వార్థంలో
అందమైన ముసుగులో
అంతుచిక్కని ఆడంబరాలలో
పై పై ప్రేమల దోబూచులాటలో
చిక్కనైన బతుకు బాటలో
అనుభవాల కచేరీ పాటలో
అనుక్షణం అప్రమత్తం
సదా ముదావహం.
- పరమేశ్వరి పులిపాటి, 9441824344