Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అతివల అందాలకి
అదనపు సొగసులద్దడాన్కి
అదొక ఆకర్షనౌతుంది.
పదిమంది ముందు
పసివాడి ఆకలితీర్చడాన్కి
అది ఓ పవిత్ర ఆభరణమౌతుంది.
తన కన్నీళ్ళనే కాదు
ఆపన్నుల కన్నీళ్ళు తుడుస్తూ
ఓదార్పునిచ్చే ఆలంబనవుతుంది.
అన్యాయాన్ని ఎదురించేటప్పుడు
ప్రదర్శించే పౌరుషానికి
ఓ చిరు చిహ్నమవుతుంది.
స్వేదం చిందిస్తేగాని
రోజుగడవని తల్లులకు
పిల్లల్ని వ్రేలాడదీసుకోడాన్కి
చంకన ఊయలవుతుంది.
సిగ్గుమాలిన సమాజంలో
కపటపు కళ్ళుగప్పడాన్కి
ఓ రక్షణ కవచమవుతుంది.
కన్నవాళ్ళే కాదనుకున్నప్పుడు
అయినవాళ్ళుఅక్కరకురానప్పుడు
దీనస్థితికి దిగజారినప్పుడు
దేహీ అని అర్ధించడాన్కి
ఆ ''పవిటకొంగే''
బిక్షాపాత్ర అవుతుంది.
ఆత్మాభిమానాన్ని
చంపుకోలేనప్పుడు
శాశ్వతంగా దూరమవడాన్కి
ఆ ''పవిటకొంగే''
ఉరితాడవుతుంది.
- యం యస్ రాజు,
9502032666