Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెట్టు మాట్లాడే పూలభాష
నదీగట్టుకు తెలుసు!
నా మనసు మాట్లాడే ప్రేమభాష
నీ ఎదపుట్టకు తెలుసా?
నీ ప్రేమ ఒక విషసర్పం!
నా ప్రాణం ఒక విలువైన పుష్పం!
నువ్ బుసకొట్టినపుడెల్లా...
నా ప్రాణపుష్పం రాలిపోయింది!
ఆకాశం ఆవులిస్తే చుక్కల్ని
లెక్కపెడుతోంది పచ్చని అడవి!
నేను కవితల్ని విసిరేస్తే!
పడమటి ప్రేయసి పెదవిపై అరుణబింబం తాంబూలం!
ఈలోకం ఒక అర్థంకాని శ్లోకం!
నా హదయం ఒక వైప్లవ్యగీతం!
నువ్ నా గొంతునొక్కితేనేం!
నాలో పొంగుతోంది చూడు..
జన చైతన్య సముద్రం!
సున్నం రంగు వెలిసిన మా ఊరి
మట్టి మిద్దెలపై వెన్నెల వర్షం!!...
నా మట్టి బుర్రను ఊయల్లో
అమ్మముద్దాడితే పుట్టిందే నా కవిత్వం!
ఎర్రగారం తిన్న నా నాలుకపై
కరువు కావ్యం పుట్టుమచ్చ!
ఎవరిదిష్టి తగిలినా చెరిగిపోదు
నా కలాన్ని కన్నీటిఏటిలో ముంచి పల్లెనుదుటిపై
నే పెట్టిన పచ్చబొట్టు!
- బిక్కి కష్ణ, 8374439053