Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒంటరిగా మాట్లాడుకోవడం...
కదులుతున్న దశ్యాల ముందు
నన్ను నేను ఆవిష్కరించుకోవడం
మౌనచెట్టుపై మాటల రెక్కలు అల్లాడిస్తూ
ఒక సన్నని తీగ నుండి మాట రూపాంతరం చెందడానికి,
గట్టు తెగిన మాట నిర్మలంగా... నాలో ఇంకిపోడానికి
ఇంకిపోయిన మాటను
పదే పదే నములుకుంటూ మురిసిపోవడానికి
మాట కట్టుకున్న పక్షి నోట్లోకి
ఒక గింజను విసరడానికి
నవ్వినప్పుడు ఏర్పడిన బుగ్గల లోయల్లో నుండి
కాంతి కిరణాన్ని గుంజడానికి
బతుకులోకి రంగులను పులుముకోడానికి
ఒక చూపును అటువైపు ప్రవహింప చేసి
ఇంకో చూపును ఒంటరి గదిలో మొక్కలు మొక్కలుగా నాటి
వికసించిన పువ్వులపై నవ్వులను ఏరుకోడానికి...
మాట నుండి మాటలోకి ప్రయాణించడానికి
అడుగుల కింద పోగైన నాటి ఆకలి గీతాలను
విరహ వేదనలను, సలిపిన సందర్భాలను
విరిగిన సంఘటనలను, అమాయకపు ఆలోచనలను
మనసులో దాచుకోవడానికి
దాచుకున్న చీకటి మూటలను
మాటలు మాటలుగా బహిర్గతం చేయడానికి
విశాలమైన, నిగూఢమైన, ఎలాంటి పరిధులు లేని
ఓపిక కావాలి...
తప్పకుండా...
ఆ వెన్నెల...
మాటల నడకలతో
ఆ గుమ్మం నుండి ఈ గుమ్మంలోకి
వెలుగును మోసుకుంటూ
నా చూపుల దారుల్లో
చిరుదివ్వెలు వెలిగిస్తుంది
ఒంటరి అక్షరానికి జతై
పద పరిమళాన్ని సష్టిస్తుంది
ఎవరికైనా... ఏం కావాలి?
అక్షరానికి అక్షరం తోడైనట్లు
మనషికి మనిషి తోడవ్వాలి
కొన్ని మాటలు పోగు చేసి
పొయ్యిని అంటించాలి
ఇంతకూ అక్కడ ఉడుకుతున్నది
అన్నమా... మాటలా...
ఏదైతే ఏంటి?
రెండూ...
శూన్యమైన నా కడుపును నింపేవే...
కొండలపై నుండి
జారే నీరు... వధా కాదు
అదొక సంగీతం...
సంగీతానికి మాట కలపండి
కాకపోతే కాస్త ఓపిక పట్టండి
ఒకనాడు బతుకు మారు మ్రోగుతుంది
విశ్వం...
తల వంచి నమస్కరిస్తుంది
అరే మేరే జాన్
ఫికిర్ మత్ కర్
సబర్ కా ఫల్... తేరే లియే... బనా హువా హై...
- లై, 9491977190