Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భయపడకు.. ఆనందపడిపో..
ఒకే గొంతుతో శవాలు మాట్లాడుతాయి
ఓ రాజా.. నీ రామ రాజ్యంలో శవాలు గంగానదిలో ప్రవహించడం చూశాం
ఓ రాజా.. అడవి అంతా బూడిదయ్యింది,
ఆనవాళ్ళు లేవు, అంతా శ్మశానమైపోయింది,
ఓ రాజా.. బతికించే వాళ్ళు లేరు,
శవాలను మోసేవాళ్ళూ కనిపించడం లేదు,
ధు:ఖితులు మాత్రం మిగిలారు
అంతా కోల్పోయి మిగిలాం
మాటలు లేక బరువెక్కిన మా హృదయాలు శోకగీతాలైనాయి
ప్రతి ఇంటిలో మృత్యుదేవత ఎగిసిపడుతూ తాండవమాడుతోంది
ఓ రాజా.. నీ రామ రాజ్యంలో శవ గంగా ప్రవాహమైంది
ఓ రాజా.. కరిగిపోతున్న పొగగొట్టాలు కదిలిపోతున్నాయి,
వైరస్ మమ్మల్ని కబళించేస్తోంది
ఓ రాజా.. మా గాజులు పగిలిపోయాయి,
భారమైన మా హదయాలు ముక్కలయ్యాయి
అతను ఫిడేలు వాయిస్తున్నప్పుడు మా నగరం కాలిపోతోంది
బిల్లా రంగాల బరిసెలు రక్తదప్పికగొన్నాయి
ఓ రాజా.. నీ రామ రాజ్యంలో శవ గంగా ప్రవాహమైంది
ఓ రాజా.. నీవు మెరిసిపోతున్నట్టు, మండుతున్న కొలిమి లాగా
నీ దుస్తులు తళుక్కుమనడం లేదు
ఓ రాజా.. ఈ నగరమంతా చివరిగా నీ ముఖాన్ని చూస్తున్నాయి
ఇక పరిమితులు, మినహాయింపులు లేవు
నీ దమ్ము చూపించు,
రా.. బయిటికి రా.. గట్టిగా చెప్పు, పెద్దగా అరువు,
దిగంబర రాజు అవిటివాడు, బలహీనుడు
ఇక నీవు ఏ మాత్రం మంచివాడిగా ఉండలేనని చెప్పు
కోపంతో ఊగిపోతున్న నగరం మంటలు ఎగిసిపడుతూ
ఆకాశాన్ని తాకుతున్నాయి,
ఓ రాజా.. నీ రామరాజ్యంలో శవగంగా ప్రవాహాన్ని చూశావా?
- పరుల్ కక్కర్ (గుజరాతీ కవయిత్రి)
- అనువాదం : రాఘవ శర్మ