Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బుక్కెడు బువ్వ
గుక్కెడు నీళ్ళు
గుట్టమీద ఆవాసం
కష్టాలతో సావాసం!
తెల్లారకమునుపే తండ్లాట మొదలు
తెల్లారితే తడారే ఊటచెలిమెలు
త్వర త్వరగా తెములు
వేసవి ఎండలు! కమ్మరి కొలుములు!!
రాదారిలో కరమగాల కాపు
రవాణా లో కుండ పగుళ్ళ దాపు
రణరంగమైన రోజువారీ బతుకు
రాజీపడితే దొరకదు ఎంగిలి మెతుకు!
ఏరువాక దుక్కుల సాగు
సాలువారే దుఃఖపు వాగు!
భూదేవికి బలిహారం
భూస్వామికి ఫలహారం!!
విత్తనం వేసే ముందు
కలుపు తీసే ముందు
పంటకోసేందుకూ
పరిహారం! సాంప్రదాయం!!
స్థిమితంగా చేయాల్సిన కొడుకు పెళ్లి
స్థోమత లేక కుటుంబం వెలి!
షావుకారుకు ఇల్లు కుదువ
సాలు సాలుకు ప్రణమిల్లు కాయిదా!
(కాయిదా అనేది ఆదివాసులు తప్పనిసరిగా పాటించాలనే సాంప్రదాయం)
- కరిపె రాజ్ కుమార్, 8125144729