Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎప్పటిలానే
ఋతు ధర్మపు క్రమశిక్షణ తప్పని
భూమధ్య రేఖ..
నడినెత్తిన సూరీడు మంటలు !
స్వంత ఊరు
పరుగులో పిడచకట్టిన నాలుక
ఆకలి సెకలకు కాలుతున్న పేగులు..
రహదారులపై..
రక్తమోడుతున్న పాదపు గుర్తులు !
ఆర్థిక వెన్నెముక లేని
కూలీ బతుక్కి
జాతీయ గుర్తింపు చిహ్నాలు.
వీపుపై మూటా ముల్లెలు !
కుటుంబ..
ప్రేమకు తీపి గుర్తులుగా
పసిపిల్లల అడుగుల్ని మోస్తున్న
కన్నతండ్రి భుజాలు..
కన్నీటి కావటి కుండలు !
గమ్యం తెలిసినా
గమనం ఎట్లనో తెలియని
సంధి కాలపు క్లిష్టసందర్భాలు !
కాళ్ళే రెండు చక్రాలుగ
ఎండనక, వాననక
చెమట గంధపు శరీరాలు
వేసే ప్రతి అడుగులు..
దూరదుఃఖపు మడుగులు !
పాదాలే పనిముట్లుగ
తొవ్వలపైజి
స్వేదనదులుగ ప్రవహిస్తూ
నడక పుట్లను
పండిస్తున్న ఎర్ర గోరంటలు !
తూర్పు..
శ్రమకొండల నడుమ పొడిసి
సొంత గూటికి తరలుతున్న
పడమటి పని పొద్దులు !
(వలస కార్మికులు సొంతూళ్ళకు చేరే తపనలో పడే ఇబ్బందుల నేపథ్యంలో..)
- అశోక్ అవారి, 9000576581