Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీవు
బువ్వలోని గంజిని వార్చే సిబ్బివై
కుండను నిలిపే చుట్ట కుదురువై
ఇంటివాసానికి వేలాడే ఉట్టివై
బాయి మన్ను మోసే మట్టి తట్టవై
పల్లె జీవనంలో ఓ వెలుగు వెలిగిన
నీ హస్తకళ అపురూపం, అపూర్వం!
నీవు
పెండనెత్తె పెండతట్టవై
అంబలి మోసే అంబటి తట్టవై
అరకెద్దులకు, పాలిచ్చే ఆవులకు
దానవెట్టే దానబుట్టివై
పంటచేలను మేయకుండా
పశు మూతులను బంధించే ఎద్దుబుట్టివై
పంటకోతలకు పొట్టు జల్లవై
పెట్టిపోతలకు జల్లిబుట్టివై
తరతరాలుగా ఓ వెలుగు వెలిగిన
నీ సజనాత్మకత అబ్బురం, ఆశ్చర్యం!
నీవు
ఇల్లును ఊడ్చే ఈత పొరకట్టవై
కోళ్లను మూసే కోళ్ల గంపవై
ధాన్యాన్ని దాచే ధాన్యపు గుమ్మివై
పిల్లల బారసాలలో ఊగే తొట్టెలవై
మహిళల మరుగుకు జాలెట తడకవై
పోశమ్మ పండుగకు మొలకల బుట్టివై
మొక్కల పెరుగుదలకు రక్షణ గుమ్మివై
గ్రామీణ జీవనంలో ఓ వెలుగు వెలిగిన
నీ నైపుణ్యం అమోఘం, అద్భుతం!
ఇంత సజనాత్మకత, నైపుణ్యం ఉన్నా ఈ బ్రాహ్మణీయ మనువాద సమాజంలో నీవు అల్పుడవే, అధముడవే.
''మానవ నాగరికతను మలుపు తిప్పిన వ్యవసాయం
దానికి ఊతమిచ్చిన ఎరుకల తెగ వత్తి సాయం''
- వలిగి కష్ణ
సెల్ : 9490411831