Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీ తనువు నిండా
అణువణువు
ఓ పువ్వుల తావినై
విచ్చుకుంటా...!
నీ దరహాసపు
నవ్వులకు
నింగిలోని నెలవంకనై
అనునిత్యం చెంత చేరుతా..!
నీ చెవిలా
దుద్దులకు కుందనమై
తీరని అందాలను
అంటు పెట్టుకుంటా..!
నీ చేతుల
గాజులలో
పారే ఏరులో అలుగై
సరికొత్త సవ్వడుల
సంగీతాన్ని అవుతా...!
నీ కన్నులలో
కాంతులు విరజిమ్మే
పున్నమి నాటి చంద్రుడి
వెలుగునవుతా..!
నీ దరహాసపు కన్నుల
కొలనులో తామెరనై
కనువిందు చేస్తా...!
నీ గొంతులో
రాగాల ప్రవాహమై
సరాగాల ఊసులను పంచే
సరిగమలనవుతా...!
నీ మదిలో
భావాల అలజడులకు
కోకిల గొంతుకనై
కొత్త రాగాలను ఆలపిస్తా...!
నీ వలపుల
తనువులో వాననై
తడిసి ముద్దనవుతా..!
నీ కలల
కౌగిళ్ళ గూటిలో
నీ వశమై యధేచ్ఛగా
ఆశల పల్లకినవుతా..!
నీ జీవన
గమనంలో
వెన్నెల జాబిలిలా
జీవితాంతం తోడై ఉంటా..!
నీకై
నా దేహాన్ని ధారపోసి
ఆరిపోని మమతల
ఉజ్వల దీపానవుతా..!
నీలో నేను
జన్మ జన్మలకి
ఓ కొత్త రూపమై
ఆమనీ వసంతములా
రూపుదిద్దుకుంటా..!
- కొలిపాక శ్రీనివాస్
9866514972