Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాన్న దేన్నీ పట్టించుకోడు,
మనకోసం ప్రతిక్షణం ఎంతగా తపిస్తాడో
మాసిన ఆ గడ్డాన్ని అడిగితే తెలుస్తుంది!
నాన్న ఏ పనీ చేయడు,
జీవితంలో ఎంత అలిసిపోయాడో
ఆ మూడోకాలును అడిగితే తెలుస్తుంది!
నాన్న ఇంటికెప్పుడూ ఆలస్యంగా వస్తాడు,
ఇంట్లో లేకున్నా ఇంటి గురించే తిరుగుతాడని
ఆ మోకాళ్ళనొప్పులను అడిగితే తెలుస్తుంది!
నాన్న ఏదీ బయటికి చెప్పుకోడు,
కడుపులో ఎన్నెన్ని బాధలు దాచుకుంటాడో
పెరిగిన ఆ పొట్టను అడిగితే తెలుస్తుంది!
నాన్నెప్పుడూ అందరికీ దూరంగా ఉంటాడు,
ఏ కష్టమొచ్చినా ముందుంటాడని
అరిగిన ఆ చెప్పులను అడిగితే తెలుస్తుంది!
నాన్నకెప్పుడూ కన్నీళ్లు రావు,
దుఃఖాన్ని దిగమింగిన గుండె ఎలాంటిదో
ఆ కంటిపొరను అడిగితే తెలుస్తుంది!
నాన్నెప్పుడూ లెక్కలు కడుతుంటాడు,
ఆయన త్యాగం ఎలాంటిదో
రాలిన ఆ జుట్టును అడిగితే తెలుస్తుంది!
నాన్నెప్పుడూ అబద్దాలు చెప్తాడు,
మనం అర్థం చేసుకునేలోపు
చివరికవే నిజాలౌతాయని తెలుసుకోలేకపోతాం!
ఏదడిగినా డబ్బుల్లేవు అంటాడు,
ఐనా అందరి కోరికలు తీరుతుంటాయి,
ఆయన మంత్రమేదో తెలుసుకోలేకపోతాం!
నాన్నెప్పుడూ కఠినంగానే కనిపిస్తాడు
రాయిలా కనబడే మంచుపర్వతమని
చివరికిదాకా తెలుసుకోలేకపోతాం!
నాన్నెప్పుడూ పాతబట్టలే వేస్కుంటాడు,
అందరి నవ్వులే తనకు కొత్తబట్టలనుకునే
నాన్నగుణాన్ని తెలుసుకోలేకపోతాం!
మనమేం తప్పు చేసినా
నాన్న కోపం ఎప్పుడూ అమ్మ మీదే,
మన కన్నీళ్లను అమ్మ కంటిలో చూస్తాడు!
జూన్ 20 పితదినోత్సవ సందర్భంగా
- పుట్టి గిరిధర్
సెల్: 9491493170