Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1. గొయ్యితీసి సముద్రాన్ని పాతిపెట్టిన.
ఈడ సముద్రం లేదని శాసనం రాయించిన.
పాశిట్టి దులుపుకుంట మనుషులు
ఉప్పు చారికలై సమాధులపై మొలుత్తాంటె
నాలుగు వానసుక్కల్ని రాల్చమని
మొగులును బతిమాలుకున్న.
బకాయిపడ్డ అప్పు తేరకముందే
మల్లెట్ల అడుగుతానవని గుడ్లురిమింది.
మొఖం ఏడబెట్టుకోవాల్నో తెల్వక
నడినెత్తిమీది వెలుగును భరించలేక
చీకటి చెట్టెక్కి కోతికొమ్మచ్చి ఆడుతాన.
భేతాళుడి శవం నా దంటగాడు.
2. జవాబు చెప్పే అలవాటు లేదని
ఇంటి ముంగటి లేతమొక్కకు
అట్టముక్క యాళ్లాడగట్టిన.
సైగ చేస్తానో.. చూపుడువేలు సాగదీస్తానో
తెల్వదుగని ప్రశ్నాపత్రం లీకైన ముచ్చట
పసిగడుతానికీ గడియ సుత పట్టదు.
వడలిన కాడల మొఖాలతో
దుక్కం సముద్రమై పొంగుతది.
యిప్పుడు దీన్నెక్కడ దాయగలను?
3. ఖాయిసు పడ్డోల్లందరు
కాటికి బోదమని తయారైతాండ్లు.
నేనొక్కన్నుండి ఇక్కడేంజేయను వొంటరిగ.
ఎహే.. ఊకో బిడ్డా..
ఆడ ఎట్లున్నదో జూశి కారటు రాత్తం.
ఇగో.. గీ శారెడు నూకలు
నీ కోసమే ఓరకుబెట్టినం.
మతలబు అందేదన్క
వుడుకబెట్టుకుని తిను.
మొగులూశి పడ్డట్టు
ఎగేసుకుంట ఎన్కమర్లనే బాటపట్టకు.
తొవ్వదప్పి కాటు గల్వకుంట బత్కు.
మాటదప్పవు కదా..
4. మాటమీద నిలబడుడు
ఎంత కష్టమో వాళ్ళకేందెల్సు.
యాల్లపొద్దుగాల
మూటముల్లె సదురుకుని
ఎవల సక్కిన వాళ్ళుబోయిన్లు.
వాళ్ళదేంబోయింది.
ఇచ్చిన మాటకోసం గీన్నే పడి ఏడ్తాన.
లంకంత కొంపల బిక్కుబిక్కుమనుకుంట
ఒక్కలే బత్కాలంటే ఎట్లుంటదో..
ఎర్కలేనోళ్లు ఎన్నైనా జెప్తరు.
వీళ్ల మాటిని ఈన్నే వుండుడు
ఎంత బుద్దితక్కువ పని.
పోయినోళ్ళ జాడపత్తలేదు.
నన్ను పురాగ మర్శిపోయినట్టున్నరు.
5. యిప్పుడు ఇంక నూకలెన్నున్నయో
లెక్కబెట్టుకోవాలె. ఒకటి.. రెండు.. మూ..
ఎప్పుడొచ్చి కూసున్నదో సముద్రం.
పాలనురుగు మూతితో
నా పాదాల్ని నాకుతాంది.
ఎంత ముద్దుగున్నదో బుజ్జి బుజ్జిగ.
కాళ్ళల్ల కాళ్ళల్లనే మెదులుతాంది.
మీదిమీదికొత్తాంది.
పెయ్యంత పునికి దూరం
జరిగినట్టే జరిగి అమాంతం దునుకుతాంది.
ఎంత పాయిరం దీనికి నేనంటే!
ఇసుకలో తడిపాదముద్రలు.
నావెంటే తను. ఆనవాళ్ళను చెరుపుకుంటూ..
- బండారి రాజ్ కుమార్, 9959914956