Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగరికత...
నవపుంతలు తొక్కుతున్నా
వివేకం...
దశదిశలా విస్తరించినా
కొందరిని...
వీడని నీడే ఆకలి.
పూటపూటకూ పలకరిస్తూ
పేగుల్నిమెలిపెడుతూ
పేదవారి ముంగిట్లో రంగవల్లై
డొక్కలకు
ఆకలిమంట వర్ణాలద్దుతూ
ఆర్తనాదాల నిలయమై
కాలంతో పోటీపడుతూ
సాగుతుంది రావణ కాష్టంలా
ఊపిరితో
ఊపిరిపోసుకొనే మంటది
కొనఊపిరిదాకా
సాగే ఆరాటమది
కోటివిద్యలకు మార్గదర్శై
పడరానిపాట్లెన్నింటినో
ఆత్మీయంగా స్వీకరిస్తుంది
విప్లవాలకు నాందిపలికి
పోరాటతీరాలను స్వాగతిస్తుంది
ఊసరవెల్లిలా రంగులు మార్పించి
వ్యక్తిత్వాలను దిగజార్చుతుంది
నిస్సహాయత నిరాశలను
బహుమతిగా అప్పగించి
ఆవేదనల రొదలు వద్దంటూ
జోకొడుతుంది
అది ఏదైనా చేయగలదు
దేన్నయినా సష్టించగలదు
మార్పుకూ శ్రీకారం చుట్టగలదు.
- వేమూరి శ్రీనివాస్,
సెల్: 9912128967