Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్కడ పొగ లేచిందంటే
కొన్ని భవంతుల అస్థికలు
పీలికల్లామారి బయటపడితే
మరికొన్ని దేహాల శకలాలు
రాజ్యాధికార దాహానికి చిచ్చుబుడ్లల్ల
గాల్లో ఎగిసిపడ్తుంటాయి..
పాలస్తీనా పాలబుగ్గల మీద
రక్తపు చారికలు పారుతుంటే
దాని నుదుటి గీతల్లో
సంతోషం కన్న దుఃఖ రేఖలే
అధికంగా గీయబడ్డాయి..
గాజావీధుల్లో తాజారక్తం ఏరులై
ప్రవహించి పోటెత్తితే
తల్లుల గర్భశోకం వాగులై
అక్కడ ఉరకలెత్తుతుంది..
శరణార్ధుల్లా వచ్చి తలదాచుకుని
నేడు రణనీతితో విరుచుకుపడ్తున్న
రక్తపిపాసి అమాయకుల ప్రాణాలతో
చెలగాటమాడుతుంటే..
రాజ్యకాంక్ష, పశువాంఛ ముందర
రాకెట్ లాంచర్ల రాక్షసక్రీడలో
పసి ప్రాణాలు, మహిళల మానమర్యాదలు
ఎలాంటి ఫిర్యాదు లేకుండా
దుఃఖపు యుద్ధమేఘాలై అక్కడ
కమ్ముకుంటున్నాయి..
ఏ సంబంధంలేని కొన్ని అమాయక
జీవితాలు అన్యాయమైపోతే
ఎలాంటి తప్పుచేయని కొన్ని
కుటుంబాలు మత్యుకప్పం చెల్లిస్తున్నాయి..
కళ్ళ ముందర కన్నవారిని కోల్పోయినవారు
గగుర్పొడిచే గర్భశోక వ్యాధితో సొమ్మసిల్లితే
జాతివివక్ష ప్రభావంతో తమ కళ్లేదుటే
తల్లిదండ్రుల ఛాయను కోల్పోయి తడారిన
ఏడారిలో గల్లీకొకరయ్యారు..
- సర్ఫరాజ్ అన్వర్,
సెల్: 9440981198