Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్ని వేడి దినాల
నింగీ నేలా ఎండ సంభాషణమో
ఎన్ని నెలల
వడగాలుల తండ్లాటనో...
నల్లమబ్బుల ముసుగేసుకొని
చినుకుల చప్పట్లతో సైగ చేస్తూ
నేలను తాకింది మిరుగునాడు ఆకాశ గంగ.
చెయ్యడ్డం బెట్టి
మొగులుకేసి చూసుడు ఆపేసి
కొమ్మలు మేఘాల జమిలి సాయ్యాటలకు
పచ్చని ధ్యాసలో
గాలి మోటారయ్యిండు భూమి పుత్రుడు.
అగడు అగడుగా నీళ్లను చప్పరిస్తున్న
మట్టిబెడ్డలని చూసి
తెగ మురిసి పోయిండు కాపు రాజు
తెప్పలని నల్లటి దుప్పట్ల కింద కమ్మి
భూమి ఆకాశాలు సద్దిగుల్ల భవిష్యత్తుపై
వాన సంతకం చేశాయి.
కొత్తకోడలుతో పత్తి ఇతనాలు పెట్టించి
తొలిసూరు కడుపు కాయాలని
మిరుగు బోనమేసి మొక్కింది పల్లెతల్లి.
సాలు సాలూకూ
సరితెల గింజల ధారలో
జడ్డిగాల జంపాలాటలో
ఆలు మగల పంట ముచ్చట్ల జోరులో
పోత కాతల జుంబిడి మొదలైంది.
ఇల్లూ నేలా ఒక్కసారే నెలతప్పి
ఇగురు పెడుతున్నయి
తల్లుల చెమట పాలు తాగుతూ.
మట్టివాసనకు పొంగిన పానంతోలేసి
ఎర్రటి అంగీలతో
హల్ చల్ చేస్తున్నయి ఆరుద్రపురుగులు.
మొలకల చెవుల్లో గుస గుసలాడి
బలమును బల్గమును
అర్ణమిచ్చిపోయినరు అపడాల గుర్రాలు.
నాగులు నల్ల త్రాచులూ
మగశిరా మోహంలో
పురి వెట్టిన తాళ్లయినయి.
మొలకల పాపలని
ముసిముసిగా పలుకరించ వచ్చినై
పసుపు వన్నెల బసవన్నలు
తోకలేపి తల్లిని అంబా అని పిలుస్తున్నది
ఎందొద్దుల లేగదూడ.
పచ్చని కోరికలలో
పంటనే ప్రపంచమనుకొని
లోకమే తనవాళ్లనుకొని
బతుకు పయనమై పోతున్నడు
ఆకుపచ్చని కలల రాజు
- డా. ఉదారి నారాయణ,
సెల్: 9441413666