Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నన్నా బడికి పంపొద్దు నాన్నా ..
కొన్ని ఇటుకలు సిమెంట్ కలగలిపి కట్టిన
కాంక్రీట్ కారాగారం లాంటి చోటుకు-
పరీక్షలు ర్యాంకులు గ్రేడులే
కొలమానమైన చోటుకు-
నన్ను పంపొద్దు నాన్నా..
అక్కడే రుతువుల్లేవు..
జీవనకాంక్షా లేదు
అదొక నిర్జీవమైన గర్భగుడి
అక్షరాన్ని ప్రతిష్టించాల్సినచోట
కాసులబొమ్మ కొలువుదీరే చోటుకు -
జ్ఞానం దీపమై వెలగాల్సినచోట
చీకటి రాజ్యమేలేచోటుకు నన్ను పంపొద్దు నాన్నా
రసహీనమైన బీడు తప్ప
అక్కడే పూలపరిమళాల్లేవు
పొంగే జలపాతాల్లేవు
ఒక వేకువపొద్దున అమ్మఒడిలోంచి
నేనుచూసిన ప్రాకతిక సౌందర్యమక్కడ లేదు
నేను విన్న పాఠాలకీ
నా చుట్టూ సుడులు తిరుగుతున్న
జీవితానికీ సంబంధం లేనిచోటుకు
నన్ను పంపొద్దు నాన్నా ..
నల్లబల్ల నాకో శూన్యాకాశమై కనిపించే చోటుకు -
బండరాయిమీద నన్నో
బొచ్చెపరిగెను చేసి తోమే చోటుకు -
ప్రశ్నకు బెత్తం సమాధానమిచ్చే చోటుకు
నన్ను పంపొద్దు నాన్నా ..
నాదికాని ప్రపంచంలో నేను ఇమడలేను
వీలైతే.. పారిపోతాను
కాకపోతే.. అంతర్లోకాల్లోకి అచేతనంగా జారిపోతాను !
తరగతిగది ..
ప్రపంచంలోనే అత్యంత సారవంతమైన పంటమడి
కూలికి వచ్చిపోవటం తప్ప
పంటమడిని ప్రాణవంతంచేసే
మనుషులు లేనిచోటుకు నన్ను పంపొద్దు నాన్నా ..
మొక్కలతో.. చుక్కలతో..
మనసుపెట్టి మాట్లాడనివ్వనిచోటుకు
హరివిల్లును ఉయ్యాలజేసి ఆడకోనివ్వనిచోటుకు
నన్నసలు పంపొద్దు నాన్నా..
నాదైన ప్రపంచానికి నేను ప్రవాసినైనపుడు
నాకా బడికి సంబంధమేముంది ?
ఏడాదికోసారి పుస్తకాలు మార్చడం
తరగతి గదులు మారడమూ కాదు చదువంటే ..
గొంగళి సీతాకోకచిలుకలా రూపాంతరం చెందినంత
సంతోషంగా బతుకులోకి ప్రవేశించటం ..!
ఎక్కడైతే.. జ్ఞానం పుప్పొడిలా రాలుతుందో..
ఎక్కడైతే.. సజన వివేకం జంటపూలై విరబూస్తాయో..
ఆ పూదోటకు నన్ను పంపించు నాన్నా ..
పచ్చిక మైదానాలమీద కువకువలాడుతూ
గువ్వలు ఊసులాడుకునేచోటుకు
నాలుగుదిక్కులే నల్లబల్లలైనచోటుకు,
ఏడుగుర్రాల రథమెక్కి ఊరేగుతూ - సూరీడు
వేకువ గీతాలు పాడే చోటుకు నన్ను పంపించు
కాసిన్ని విలువలు కాసింత దయ ప్రేమ కలగలసిన
గంధపుగాలులు వీచే చోటుకు
నేను ఏడ్చేవేళ .. తన కడకొంగుతో నా కన్నీరుతుడిచి
కన్నతల్లిలా ఓదార్చేచోటుకు నన్ను పంపించు
నా ఆశక్తికి విలువనిచ్చేచోటుకు
స్వేచ్ఛగా శిరసెత్తి మాట్లాడేచోటుకు పంపించు
మానవీయజేగంటలు మోగే మనోవికాసమందిరానికి
నన్ను పంపించు నాన్నా ..!!
- సిరికి స్వామినాయుడు,
సెల్: 9494010330