Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాన్న పుట్టి పెరిగిన గతమంతా
ఆడిపాడే బల్యమంతా
ఎలాగడిచిందో
మనుషుల్ని
పరిస్థితుల్ని
ఎలా చదివాడో
ఎన్ని డక్కీముక్కీలు తిని ఎదిగాడో తెల్వదునాకు
అజానుబాహుడు
ధవళవర్ణ అంగీధోవతిధారుడు
గిరిజాలజుత్తుతో
నొసటిన తిలకంతో
చెలాకిదనం చెక్కిళ్ల స్మితవదన
కల్తీలేని పుత్తడి మూర్తిమత్వం మా నాన్నది
నిజాయితితో
నీటైన పనితీరుతో
శెహభాష్ అనిపించుకుని
మర్వాడీ సేట్ల మనసు దోచుకుని
నారు అని ప్రేమారగ పిలిపించుకున్నాడు మా అన్న
దుకాణమే దునియా
పనే దైవం తనకి
కలుపుగోలు స్నేహం
కులంలో ఒక రజతవెలుగు తన ఉనికి
కుంపటిలో మూసబెట్టి
పొగగొట్టంమూతికికట్టి
ఊపిరితిత్తుల నిండా ఊది
రక్తం కరిగించితే
చెంగిలించిన తప్తలోహం
శ్రమించిన స్వర్ణకాల క్షణాలింకా ఎరకే నాకు
నొసటి పైవంకీలై లతలా ముంగుర్లు వాలంగా
చెంప నుండి, ముక్కుపై చెమట బిందువులు
జాలువాలంగా
దండెకడియాలకు
జబ్బల కండలు దండిగాఆడిన అందం..
మోగిన సుత్తెశబ్దం.. నా గుండెలో గూడై వుంది
కాలి నడకతో పల్లెలుతిగి
నమ్మకంతో నగలుచేసి
ఆ కల్లాకపటమెరుగని గిరిజనుల మనసు దోచి
వారిచ్చిన కాయధాన్యాల ముల్లెలు మోసి
తన దుకాణానికి బాటలు వేసి
నలుగురు కులస్తులకు ఆశ్రమంచేసి
దుకాణంనిండా సందడిపోసి
సంగంతా కచ్చులాల సంతాలా చేసిన
ఆ గుప్తులయుగం ఇంకా నాకు గుర్తే
చదువు సంధ్యలు నేర్పి
ఉన్నంతలో ఉన్నతంగా సాదాడు
అమ్మను మమ్ముల మా తండ్రీ
ఆత్మీయ కోవెల తన ఇళ్ళుగా భావించి
మమతానురాగాల లోగిలిగామలచి
అయినవాళ్లందరికి ప్రేమల పెన్నిధై
విడిచిన ఆ అడుగుజాడలుఇంకా అలానే వున్నాయి
కష్టమంతా తను పడి
కాలం చేసినా
మా గుండెల్లో బ్రతికి ఉన్నాడు మా అన్నా .
నీవు నడిచిన బాటే మాకు ఆదర్శం ఇప్పుడు
నాన్నకు ప్రేమతో.....
- నల్లగొండ