Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొయి కిందకుంటే
పొయి మీదకు లేని బతుకులే ఇంకా
గాయమైతే
చిటికెడు రాసుకోవటానికే దొరకని పసుపు
నీకు పసుబ్బువ్వెట్ల ఒండిపెట్టాలె?
తలదాచుకునేందుకు
ఇంటి ముందున్న వేప చెట్టునెపుడో
రియల్టరోడు నరికేసిండు
నీకు వేప మండలెట్ల అలంకరించాలే?
పోతరాజులనెపుడో పాతరేసి
రాజులే రాజ్యం చేస్తున్న కాలం
అమ్మా నిజానికి
నీకిష్టమైన కొలుపుల్లో
పేదోళ్లమాటల దండకాలెక్కడివి
నిన్ను కూడా సంస్కతీకరించి
అర్థంకాని మంత్రాలతో
తలబొప్పికట్టేలా చేస్తుండ్రు
నీ వీరత్వాన్ని పప్పుబెల్లాల్లా ఆరగించి
మంచానికి బోర్లాపడి వదిలేస్తుండ్రు
బోనమెత్తుకున్న మాతంగిని చూస్తే
ఇంకా ఆరని స్త్రీ దుఃఖం
చితి మంటై తగలబడుతున్న దశ్యమే కనిపిస్తది
పండగపూట బోనాల నైవేద్యాలన్నా
మా పేదింటి ఆకలి గడపల్ని తాకితే
అంతే చాలనుకునే బతుకులు
అమ్మ పేరు చెప్పి తలకెత్తుకున్న బోనం
ఊరందరికీ భోజనమయ్యే
గడియకోసమే మా ఎదురుచూపులు
- చిత్తలూరి