Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరిగి తిరిగీ!
నడి ఎడారి
రహదారి ఎండమావిలో
తెగిన చెప్పుతో
బ్రతుకు నావ ప్రయాణం నాదైతే!
నట్ట నడి ఎండలో
ఇరుసిరిగిన బండిపై
మా అయ్య
పడిగాపుల సూర్యుడై
కరిగి కరిగీ! ఒరిగిపోతుండు
మిద్దె మీద అద్దె గది
నిర్బంధ నిశీధి ఆవాసంలా వుంది
జాబు కాలెండర్ సంగతి సరే!
గాలికి ఎగిరే
గోడ కాలెండర్ చిటపటల్లో
కాలం కాగి కరిగిపోతున్న చప్పుడు వస్తుంది
అమ్మ అడిగే కుశల ప్రశ్నలకి
అన్న అడిగే అన్నం ఖర్చుల సంగతులకు
ఇంకా ఎన్నాళ్లని అబద్దాలు చెప్పాలి
కన్నీళ్లు తాగి ఇంకా ఎన్నేళ్ళు బతకాలి?
నిరుద్యోగమే ఉద్యోగమైన దౌర్భాగ్యపు వేల
ఆ భతికి మౌనం పాటిస్తున్న పనిలేని పట్టాదారిని
నా గమనం
క్షణాలు లెక్కేసుకునే గడియారంలో ముల్లులా..!
మత్యువు మడుగులా....!
అంతిమయాత్రలో పూలపరిమళంలా...!
గగనం కురిసే వడగళ్ల బాష్పములా....!
దిగంతాల దిగులంతా నాదేలా వుంది
అయిందేమీ లేదు
దారం మాత్రమే తెగిపోయింది
ఆశల గాలిపటం
ఇంకా గాలిలోనే ఎగురుతుంది
శిథిలమవుతున్న స్వప్నాల సౌధం పైనుంచి
ఊహల దారాలను విసురుతూనే ఉన్నా!
ఒక్క కొలువైనా రాలకపోతుందా అనీ!!
- వెంకటేష్ పువ్వాడ
7204709732