Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూడంకె ముస్తాబు వదిలి
కొత్త రోజును విత్తి చూడు..
పగటిపై పరచిన పరదాలను
ఓ పక్కకు నెట్టి చూడు....
చీకటి కొండెక్కింది, బారెడు పొద్దెక్కింది
కళ్ళు మూసి కలలు కంటే
సత్తుగిన్నెలో సమాధానం ఉడకదు
రెప్పల తలుపులు తెరిస్తేనే
ప్రశ్నలు కుప్పలుగా కనపడతాయి..
ఇగో... ఇక జాగో... జవాబు దేదో అంటూ
ప్రశ్న ఒకటి సంధించి చూడు
నడి నెత్తికి ఎగ బాకిన ఎండకు
పాదాల క్రిందకి దిగజారిన నీడ
గానుగ ఎద్దులా గాయాలను నాకుతూనే వుంది..
చేతనైనంతగా చేతులు జాపి
వెతలకు మొలిచినా వ్యధల స్థానం లో
వెన్నెల పూలను పూయించి చూడు...
అబద్దాల పెత్తందారీ తనానికి
ఆది నుండీ కప్పం కడుతూవున్న
''నిజం'' నీ ఎదురుగా నిలబడి వుంది
మసక చీకటి లో మరుగున దాగుంది
నీ ఆలింగనానికి ఆరాట పడుతోంది..
నిర్భయంగా నిజం భుజం తట్టి చూడు...
పీర్లు గుండాన పడే వేళయ్యింది
పొడుగు ముల్లు గొడుగు కింది కాలం
క్షణం ఆగక కదులుతూనేవుంది
భూమిలో మాగేసిన అడుగుల్ని
భారం గానైనా కదిపి చూడు
వచ్చే తరానికి నచ్చే దారయి చూడు....
రేపు కొత్తగా తెల్లారుతుంది...
అరటి ఆకులమాటున అండజం కూడా
అనురాగన్ని పంచటం చూస్తావు...
- రెబ్బారం రాంబాబు