Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వయసు చూస్తేనేమో సగంలో సగం
మనిషి చూస్తే చిర పరిచయ రూపం
బూటింగ్ లో నామ రూపాల మనోఫలకం
పాత జ్ఞాపకాల బ్యాకప్ పొరల నుంచి
ఎంత సెర్చ్ చేసినా కొలిక్కి చిక్కని ఆకారం
నల్లని చలాకీతనం చమత్కారాల సంభాషణ
ఆ నవ్వుల నుంచి పన్ను మీద పన్ను మెరుపు
తెల్లని పలు వరుస, ఎన్ని సార్లో మాట్లాడినట్లు..
గలగల మాటల ఆగని వాగు ప్రవాహం
ఎక్కడో విన్నట్లే తోస్తున్నది
ఆమె పద బంధాల మధ్య ఇంగ్లీష్ సౌందర్యం
చెంప మీద సొట్ట, నొసలు మీద చెమట
చూసినట్లే వర్చస్సు స్ఫురణకు రాని యశస్సు
మనసు వయసు పెరుగుతున్న కొద్దీ
జ్ఞాపక పలకలు పలచగా అవుతాయేమో
పదబంధ ప్రహేలికలో కూర్చే అక్షరాల్లా
నిలువూ అడ్డం గడులతో ఆలోచిస్తున్నాను
నలభైఏళ్ల కింది కాలమానిని కనిపించింది
పదో తరగతి నాటి క్లాస్మేట్ సాక్షాత్కారం
అవునవును ఆమె తనయనే ఈ అమ్మాయి
అచ్చం అమ్మ నోట్లో నుంచి ఊడి పడింది.
- అన్నవరం దేవేందర్
9440763479