Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాస్సేపు చుట్టూ చుట్టూ తిరిగే పిల్లిపిల్లలా
కాళ్ళావేళ్ళా అడ్డం పడుతూ సరదా పడుతూ
మరికాస్సేపు దూరంగా
సుదూరంగా అందినట్టే అంది
వేళ్ళసందుల్లోంచి జారిపోయే నూనె ధారలా
అంతలోనే ఆకాశానికి ఆ చివరన అదశ్యమవుతున్న
కాషాయపు అగరుపొగల ఆఖరి నీడలా
ఎందుకిలా మాటి మాటికీ రంగులు మార్చే
చెదిరిపోతున్న హరివిల్లవుతావు?
సమస్థ ఆకర్షణనూ
పోగేసుకున్న అయస్కాంతక్షేత్రమై
నీ చుట్టూ ఇనుప రజనులా తిప్పుకుంటావు?
నా చుట్టూ హరిత వసంతాన్ని పోగేసుకు
కోయిల విరహ గీతాల వేడిని రాజేసుకు
వెన్నెల రెక్కలపై విశ్రమించి
ఊసుల కలకూజితాల్లో
ఊహల చిత్రాలు గీసుకుంటూ
నాచుట్టూ పరిమళాల కంచెగా
పలుకు కర్పూరపు బిళ్ళలా
వలపు వెండితీగల కోటగోడలా
వజ్రపు తళుకు చూపులా
నువ్వుండాలనుకుంటానా !
దుర్భిణితో వెదికినా
ఎక్కడా అంతుచిక్కని
ఆవిరి చుక్కవవుతావు
విసిగి వేసారి
నిరంతరం కురిసే
దిగులు కుంభ వష్టిలో
బీటలు వారిన భూమి చెక్కనై
చూపులు శూన్యానికి వేళ్ళాడదీసి
పెచ్చులురేగిన చెక్కబొమ్మలా ఉంటానా
ఎక్కడినుండో ఆర్తిని మొలకెత్తిస్తూ
తొలి చినుకుల్లో తడిసిన మట్టి వాసన
ఆ వెనకే రాయబారానికి వచ్చిన
చిత్తడి మేఘాల యుగళగీతం
కనురెప్పలపై వాలి
కలలను పొదుగుతూ
నీ ఉనికి
కాస్సేపు సముద్రాల అట్టడుగున
మరికాస్సేపు హరివిల్లు స్వర్గం పైన
అంతేనా...
- స్వాతి శ్రీపాద