Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొలకల వానలో
ముద్ద ముద్దైన బడి పిల్లల్ని చూస్తుంటే
బాధనిపిస్తున్నది
కొంచెం కోపమూ ఉప్పొంగు తున్నది
మొక్కలను పానపానంగా లాలపోసి పెంచిన
లేత మందారాల చిట్టి చేతులు
రంపపు కోతలకు భీతిల్లుతున్నై
తరలి పోతున్న తరువుల శవాలని చూసి
దుఃఖపు కండ్లని మూసుకుంటున్నయి
లేత పుస్తకాల రంగుల కలలు
కొట్టివేతలు తీసివేతలు
అమ్మివేతల పాలైతున్నై
అందరూ సత్యవ్రత శాకాహారులే
రొయ్యల ముల్లెకు కాళ్ళు ఎట్లొచ్చాయని
హరిత వన దర్యాప్తు సంస్థ
చెమటలు కక్కుతున్నది
కండ్ల ముందరి దౌర్జన్యానికి
బేడీలు వేసే దమ్ములేక
గారడీ కతలు పేను తున్నది
అడవి అడవి దగ్గరే
అడ విమూలాలు అక్కడే నిక్షేపమైతే
అక్సిజెన్ రెండింటికే కాదు
మూడు ఊపిరి సంచులకూ అందుతుంది
ఒక్క భూమే కాదు, ఆకాశమూ
హరితానంద లోకమవుతుంది
ఇపుడు అడవి రూపం మారింది
చిరునామా గల్లంతైంది
అడవి కూనలు నగరాలలలో
పాలరాతి మేడల బోనుల్లో
పెనుగులాడుతున్నయి
ఇపుడు అడవి అంటే
రోడ్డుకిరువైపులా మైనింగ్ మాఫీయాలు
కలప స్మగ్లర్లకు సెంట్రీ కాస్తున్నది
నగరంలోకి పులి వచ్చిందని
పట్టపగలే లేడికూనలకు థర్డడిగ్రీ సన్మానం
సుజలాం సుఫలాం మలయజ శీతలామ్
రోజూ గొంతులో
సుళ్ళు తిరిగీ తిరిగి మూగబోయింది
అడవి అడవి తీరే
మనిషి మనిషి తీరే ఉండే
సమాంతర సమాజం కోసం
సున్నితపు త్రాసులో ఊయలూగుతున్నది.
- డా. ఉదారి నారాయణ, 9441413666