Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనిషికి
వరుస ఉప్పెనలతో ఇప్పుడు
ఊపిరాడడం లేదు
బ్రతుకు తెరువుకు
దారులు అస్సలు కనపడడం లేదు
ఈ మనిషి మనసుకు ఏమైందో
దుఃఖపు గీతాలు ఆలపిస్తూ
కాలం కంటిపై కునుకును మరచింది
ఏ తప్పిదాలు
మనిషి తలకు చుట్టుకొన్నాయో
ఏ నరుడి నడక
వక్రపు దారి పట్టాయో
బ్రతుకు పట్టాలు తప్పి
దుర్భరపు దరిని చేరాయి
మునుపటిలా కలల్ని
కంటిపై మోస్తూ
స్వేచ్ఛా జీవిలా ఎగిరడానికి
ఎన్ని యాతనల్ని చవి,చూడాలో
మోయలేని ఈ దుఃఖపు తడులు ఆరడానికి
ఇంకా ఎన్ని గుండెలు అలసి ఆరిపోవాలో
ఊపిరాడక సొమ్మసిల్లిన నా దేశాన్ని
ఎన్ని ఊపిర్లు ఊది గాడిన పెట్టాలో ?
ప్రతి ఉపద్రవానికి
ఒక్క విరుగుడన్నది ఉంటుంది
భయపెడుతున్న గాలి
బంధమై గుండె దిగుల్ని తీర్చుతుంది
మనిషికి,మనిషికీ మధ్య దూరాలు సమసి
స్నేహ సమీరాలు అల్లుకొని
భూమిపై మనిషి ఎప్పటిలా
ఆశాజీవిగా నిలిచి
సరిక్రొత్తగా చిగురించాలి...!!
- మహబూబ్ బాషా చిల్లెం
9502000415