Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మా ఊరిల
కోడికూత
మా నాయిన కత్తినూట
రెండొక్కటే సారి
చీకట్ల బీడి
మిణుకు మిణుకు మంటూ
బుడ్డి దీపంలా వెలుగు
నూరు రాయిమీద
రుయిరుయిమనే
సుమధుర సంగీత ధ్వనులు
నెలవంక రాయిమీద రాగాల చప్పుడు
కత్తి పదునెక్కుతనే ఉంటది
ఊరు పొద్దెక్కుతనే ఉంటది
భుజాన నాగలితో
రైతు
లేత లేత కిరణాలతో
బాస్కరుడు
కసిర గొంగడి
సంకన అసిపెతో
మంగలి బాలయ్య
పల్లెకు వెలుగు
ఊరుకు అందం
గ్రామానికి నాగరికత
ఊసుకండ్లతో
నల్చుకుంట లేసిన నాకు
అసిపెలో సూర్యుడు అద్దం
జొన్న సేనులా పెరిగిన
సవురాలతో ఊరు
ఒక్కనాడు మా అయ్య ఊరికోతే
గుంటుక కొట్టని సెల్క
బీట్లగల్సినట్లు
గడాలన్ని వడ్లదాతికాడ
కుప్పయినట్లు
పెరిగిన గడ్డాలన్ని వరుసన
ఒక్కొక్కసారి నస్కులనే
మేం లేవక ముందే
ఊళ్ళకు
సవురాలకు మా అయ్య
గద్ద గూళ్ళలా మాసిన నెత్తులు
కాశ గడ్డిలా పెరిగిన గడ్డాలు
సాలు పట్టిండంటే మునుమెల్లినట్లే
మనుమనికి కుల్లాయి
తాతకు బోడగుండు
కొడుకుకు బాలు
తండ్రకి గడ్డం
ఇంటింటికాడ అంబటాలయ్యేది
గదువ కింద
సరం కాడికి కత్తిరాంగనే
బాలయ్యా !
పిల్లలకింత
మాడికాయ తొక్కో, చింతకాయ తొక్కో
పప్పుచారో...మజ్జిగనో...
పటేలమ్మను కూతేసేది ?
అస్సలు ఇంటిదిక్కే రాకుండైతివి
పండుగపూట
ఉలువలో, పెసర్లో
కందులు, బెబ్బర్లో నీకు మోటయినవా ?
సవురం అయిపోయినంక
శుక్రవారమని ఉత్తచేతులే
మద్యానం బడినుండి
పుస్తకాలతో నేను
ఊళ్ళ నుండి
అసిపెతో మా అయ్య
సుడివడ్డట్టే కలిసేది
ఏమన్న తెచ్చిండాని
భుజాన సెల్ల చూసేది!
పెండ్లైతే
పనంత మాదే
పత్రికలు పంచ పయినాలు
మామడితోరణాలు
పందిట్ల పెళ్లిసవురం కాళ్ళగోర్లు
మైలపోలు మంగళ స్నానాలు
ఎదురుకోళ్ల సాపలు, భాసింగాలు
లగ్గపత్రిక మశాల్తి పట్టాలి
సన్నాయి బ్యాండు తీన్మార్లు మేళాలు
ఎన్నెన్నో వెట్టిచాకిరీలు
తినెటప్పుడు
మంగలాయన కొద్దిగాగు
సుట్టాలు తిన్నంకనే మా వంతు
అసిపెనే
మా ఇంటికి బువ్వ
బతుకు బండి
మా జాతి జీవగర్ర, వెనుగర్ర
ఆత్మగౌరవపతాకం
కులవత్తికి కూరాడు
అసిపె లేకపోతే బువ్వెక్కడిది?
దేశాలు దాటినా బతికిచ్చే భరోసా
ఎడారిలోనైనా బతికే గుండే దైర్యం
అసిపె
మా గుండెపెట్టె
అసిపె
మా ఇంట్ల దీపం
వాకిట్ల మందారం
అందులో వైభోగం ఆస్వాదించినం
వాడును చూసినం
ఒక్కోసారి
చేతినిండా పనులుంటే తీరక
పొద్దింకల కూడా సవురాలే
అసిపెలోనే బతుకువంక
నాయిన చేతుల
అసిపె లేకపోతే
సూర్యుడికి కిరణాలు లేనట్లే
సూరున కొయ్యకు
వేలాడే బతుకుపెట్టె
మణిదీపం
మా అసిపె
తోలుపెట్టె
రేకుపెట్టే క్షవరపు పెట్టె
మంగలిపెట్టె బతుకుపెట్టె
కలప
అడపం పొది
అభరణం బీరువా
మా తాతల మూలనిధి
అసిపె
నాయినా
ఈ పెట్టె ఎన్నెండ్లదంటే
తాతల నాటిదనే
నిండా సొమ్ములున్న
బలిసినోళ్ళ త్రిజోరి కన్న
తరాలనాటి అసిపెనే
మా నాయినకు ముద్దు
ఊరు అందంగ లేదంటే
ఊరిల అసెపె లేనట్లే !
ఒక్కొక్కసారి
ఎవరింటి కాడన్న అసిపె తెరిస్తే
నాయిన కస్సున కసిరిచ్చేది
ఈ వెట్టి మావోనికింతంటుదేమోనని
మా నాయిన పనితనం
మాట్లాడాలంటే పొద్దు సరిపోదు
రాస్తే కాగితాలు ఒడువవు
ఎసోంటి మనిషైనా,బెరుసు గడ్డమైనా
కత్తిమోపంగనే
సన్నపిల్లగానిలా నిద్రపట్టేది
చూస్తే ఆశ్చర్యం
గొప్ప నైపుణ్యం
కూసున్నా నడిచినా
కూర్పాట్లు పట్టినా నెత్తికాడనే అసిపె
మా అయ్య చేతుల అసిపె ఉంటే
అశోకుడీకీ
మగదసామ్రాజ్యం చేతులున్నట్లే !
- వనపట్ల సుబ్బయ్య
9492765358