Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేనో నదిని ప్రేమించాను
ఒడ్లు ఒరుసుకుని పారే నదిని -
వేల మైళ్ళదాకా
తన గలగలలు వినిపించే నదిని -
సీతాకోక చిలుకలా
రంగురంగుల రెక్కలున్న నదిని -
గాఢంగా ప్రేమించాను
ఎన్నో విరహపు రాత్రుల తర్వాత
ఉన్నట్టుండి ఓ రోజు
నది నాకో లేఖ పంపింది
ప్రేమగా నాలుగు మాటల్ని రాసింది
నేనా మాటలకు చేతులిచ్చాను
కాళ్లిచ్చానుజి
ఇంకా తప్తితీరక రెక్కలిచ్చాను
గుండెకళ్ళతో
అక్షరాల్ని తడుముకున్నపుడల్లా
నేను ఆకాశమైపోయాను
ఒక సెలయేరు పట్టుతప్పి
నా ముందు దొర్లేదాకా
ఒక స్నేహం నిశ్శబ్దాన్ని బద్దలుకొట్టేదాకా
ఇప్పటిదాకా -
నదే నాకోసం
నాలుగు మాటలుగా
ప్రవహించిందనుకున్నాను
పాలుపోసుకున్నజి
నా వరికంకుల్లో
పంట కాలువ ఒరవడి కనబడింది
బువ్వపువ్వులు ఏరుతుంటే
నిష్కల్ముషమైన వాగు నవ్వు వినబడింది
నా ప్రేమ
వాగు దగ్గరే ఆగిపోయిందని తెలిసింది
ఎంత చెప్పినా
మనసెందుకో
సన్న సన్నని పాయలుగా చీలిపోతోంది
ఇప్పుడొక్కటే ఆశ!
నేను ఎదిగి ఎదిగి
ఓ నదినవ్వాలి
ఇరువురం చేయీ చేయీ పట్టుకొని
సముద్రంలో ఏకమవ్వాలి.
- సాంబమూర్తి లండ, 9642732008