Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కట్టె జాగ్రత్త సుమా !!
పయిలం మెల్లగ నడు
పట్టుకున్న కట్టె జాగ్రత్త
పట్టు జాగ్రత్త
ఇపుడు మనిషి కన్నా
కట్టెనే కరెక్టుగా ఉండాలే సుమా
కట్టె విరిగితే మనిషి విరిగినట్లే
లేస్తే కట్టె తోడు
నడిస్తే కట్టె తోడు
కూచొంగ కట్టె తోడు
కొడుకో మనుమడో ఎవరో
పక్కన ఆసరా ఐనా
పట్టుకున్న కట్టె మాత్రం
జాగ్రత్తగా ఉండాలే సుమా !
కట్టె జారితే లొపలి బొక్కలకు
గ్యారంటీ లేదు !
తాడు జారి బొక్కెన బాయిల పడ్డట్టే
ఫలఫల కట్టెపుల్లల్లా విరుగుడే
అరే ! పెద్దాయనకు
గట్టి కంక కట్టె కొనియ్యండి
ఆయనకు బాకీ ఉన్న
నాల్గు మెతుకులు - చెంచెడు చారు
లోపలికి జారనీ !!
ముసలోల్లు తమకు తాము
అనుకుంటరు చస్తే అందరికీ
మహా మంచిగుంటదని ు
అందరికీ బరువైనమని !
బతికిస్తున్నందుకు సహస్ర నామాలుగ దేవున్నీ
దయ్యం పట్టినట్లే తిడుతరు !
కట్టెకు ఆయువు నిండి
పొంగి పొర్లి పొయ్యిల పడేదాక
కట్టెతో పాటు ముసలి కట్టె
దోస్తానాగ ఉండాల్సిందే
కట్టెకు ప్రాణం లేకపోవచ్చు !
ముసలి ప్రాణానికి
ఇరుగు పొరుగు
ఉప్పస ఊరట
కట్టెనే సుమా !
వద్ధుల సంభాషణలను
శ్రద్ధగా చెవి పెట్టి ఎవరు వింటారు
ఒక్క మొక్కవోని కట్టె తప్ప
గోడకు ఒరిగి ఉన్న కట్టె !
నులక మంచం పై నిద్ర కట్టె !
రెండూ కట్టెలే !!
ఎవరు కాదంటరు
ఒక్కతీగనే కనిపిస్తై
అది చెట్టు కట్టె
ఇది మనిషిగా కట్టె
కట్టెకు కట్టె సోపతి
ఫోటో ఇడువకుండా
కట్టెతోనే దిగుతనంటడు
కట్టె పట్టుకుంటే లేని రాజసం
గాంభీర్యం పెద్దాయనకు
ముసలాయనకు
పట్టుకున్న కట్టె
ప్రాణంగా ఉంచే
సంజీవినీ పుల్లతో
సమానం !
- కందాళై రాఘవాచార్య
8790593638