Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శిఖరమెత్తు తాడిచెట్టు నిన్ను సూడంగనే..
వంగి సలామ్ కొడుతది.
కన్నబిడ్డోలిగె సవురిచ్చి
పాయిరంగ సూసుకున్నందుకు
కన్నతల్లోలిగె సాదుకుంటాంది.
కడుపుల వెట్టుకుని సూసుకుంటాంది.
ఎన్నటి ఋణానుబంధమో...
కంచుట్ల మెతుకు మెతుకున
నీ పేరే రాసిపెట్టుంటది.
చెట్టును నమ్ముకున్నోనివని
పానానికి పానం పానుకమై పారుతది.
గుజి కాళ్లకేసుకుని మోకుతో అమురుకున్నప్పుడల్లా
అవ్వ గుండెల మీద
పసిపోరడు పాకుతున్నట్టే ఉంటది.
నాగదప్పకుండ గీతగీసినప్పుడల్లా
కుతిలేశి మారాం చేసిన బిడ్డకు
పాలు కుడిపినట్టే అనిపిత్తది.
బాపూ..!
నువ్వెప్పుడు తిన్నవో.. ఏం తిన్నవో..
అమ్మకూ.. నీకే ఎరుక.
మమ్ముల గన్నందుకు
కాళ్లకు మట్టి అంటకుండ,
పెయ్యికి సెమట పట్టకుండ
గావురంగ పెంచుకున్నవు.
కల్లు మీది నురగ తీరుగ
బుస్స బుస్స పొంగే
నీ కోపం యాడికిబోయిందో!
చిన్నప్పుడు కొనసూపుకే గజ్జునొణికినోల్లం.
రేపటాల్ల నిక్కచ్చిగ నీ తరీక బత్కుతమో.. లేదో..
కాలమే జెప్పాలె.
నూరుగంటిరాయో... పలుగురౌతో..
నీ సేతుల్ల అరగదీసిన
నెరుసు గంధం పూసుకుని,
పిల్లబద్ద మీద ఆడే కత్తులు,
నూరుతున్న కొద్దీ మెత్తగ పదునెక్కినట్టు..
పారుకానికి పనికొచ్చినట్టు..
మా బత్కులు ఇగురెక్కాలని,
ఇగురంగ బత్కాలని,
రెక్కలు ముక్కల్జేసుకుని సదివిచ్చినందుకు,
జీవితసారం ఒంటికి ఇముడ్తదో.. లేదో..
తొవ్వపొంటి పడుతున్న
మా పాదాల ముద్దరలె గవాయిలై గలగలమనాలె.
చెట్టు పెయ్యంతా పురుగు బూశి లేకుండజేసి,
సుట్టూ సాపుజేసి, మారుగత్తయి మట్టలు గొట్టి,
రైతు పొలాన్ని పొతంజేసుకున్నట్టు..
నువ్వు చెట్టును పొతంజేత్తాంటె సూడాల్నె!
శింపిరి జుట్టు.. లొడాసు లాగేసుకుని..
చీమిడి ముక్కుతో
బజార్లు బట్టుకుని తిరిగే పోరన్ని
సున్నిపిండితోటి పెయ్యంత రాశి,
ఉడుకుడుకు నీళ్ల తోటి తానంబోసి,
సక్కంగ పాపిట దువ్వి
మారాజు లెక్క తయ్యారు జేసి,
ముద్దిచ్చుకుని మురిసిపోయే కన్నతల్లి లెక్క
ఎంత ఇగురంగ జేత్తవు బాపూ !
తాడిచెట్టు మీద కప్పగంతులేశినట్టే
అంతెత్తున ఎక్కి గీత గీత్తె..
ఆకాశం కడవలో వెన్నెల సుక్కల్లెక్క
ఛమక్ ఛమక్కని మెరిసేటి కల్లుబొట్లు.
ఒక్కొక్క సుక్కఒడిసి పడ్తాంటె
చెట్టు మీది లొట్టి కడుపు నిండినట్టు,
కసితో బుసకొట్టే పాములా
జోరు మీదున్న సంద్రం హౌరులా
సుయ్యిసుయ్యిన పొంగే పాలనురగల్లా
బుస్సబుస్స పొంగే కల్లు
సొబగులు ఎంతని వర్ణించను?
యుద్ధం గెల్సి వచ్చిన అభిమన్యుడి లెక్క
నడిసొచ్చే నీ రాజసానికి పెయిమీది
ఎంటికలు ఏడు మల్లెలెత్తు నిక్కబొడ్తయి.
లొట్టికి కిరీటంబెట్టినట్టు కల్లు పొంగుతాంటె
పూడిక తీసిన బాయిలెక్క
నోట్లె ఊరిల్లు పుడుతయి.
వానాకాలంల నీటిమట్టం పెరిగినట్టు
మనసుజల ఉప్పొంగి ఆనందం ఉరకలేత్తది.
మా బతుకు ర్యాకల్ని ఇగురంగ గట్టి
నీ కట్టమంత వొడిపి సాకబోత్తానవు గదనే.
నిన్నెట్ల కొల్సుకుందునే..
ఎంతైనా నువ్వు మొనగాడివి బాపు!
- బండారి రాజ్ కుమార్
9959914956