Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కనులు నింగికి అతుక్కుని
అడుగులు మాత్రం
భూమిలో ఉంటాయి
ఆదర్శం పెదవిపై ఉంటుంది
ఆచరణ మాత్రం శూన్యమై
దర్శనమిస్తుంది
తేనెలో మునకలేస్తూ మాటలు
వెన్నులో దిగుతూ కత్తులు
మాటకూ చేతకూ
ఎక్కడా పొసగదు
మేకవన్నెపులులివి
కన్నీళ్ళ నదులు
ప్రవహిస్తుంటాయి
కరగని గుండెలు
పక్కనే నడుస్తుంటాయి
నిరాశలో మునుగుతుంది ఒంటరితనం
ఒక సాంత్వన కోసం ఆరాటపడుతూ
చల్లని చెట్టు నీడకై
పరుగులు తీస్తూ
ఎడారిగుండెలు చినుకులకై ఎదురుచూస్తుంటాయి
ఆశ నిరాశల మధ్య
ఒక ఊగిసలాట ఉంటుంది
అలాగే జీవితం నెట్టుకొస్తూ ముఖాలు
సుడిగుండాలను ఎదురీదుతుంటే
గమ్యానికి చేరువలో
ఒక వెలుగుదివ్వె పిలవకమానదు
ఏదేమైనా
మిణుకుమంటున్న ఆశాదీపం
వెలుగుతూనే ఉండాలి
కలల రెక్కలు విప్పుకుని
ఎగురుతూనే ఉండాలి
మనసంతా వెన్నెల
కురుస్తూనే ఉండాలి
- పద్మావతి రాంభక్త, 9966307777