Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేహానికీ మనసుకూ ఊపిరాడనపుడు
గాలితో సంభాషించే నెపంతో
నాలుగడుగుల్ని ముందుకు నడిపించి
హదయపు వాకిలిని ఇంటి ముందు పరుస్తాను
అది పల్లె నేల అయితే మరీను
దానికి వల్లమాలిన ప్రేమ నామీద
బాహిర్ ప్రపంచపు గోడనానుకు కూర్చున్న
తన ప్రియనేస్తం అరుగు సింహాసనంపై
నన్నధిష్టింపజేస్తుంది వాకిలి ఆత్మీయంగ
అక్కడే నాకోసం ఎదురు చూస్తున్నట్టున్న
ఆకుపచ్చని నిలువెత్తు స్నేహహస్తం
నా చూపుల్ని తన గలగలల నాదం వైపు
చేర బిలుస్తుంది
శ్రవణానందాన్ని తన నీడల్లోకి జేర్చుకొని
పిట్టల కువకువల మాధుర్యంతో జత కట్టిస్తుంది
రెక్కలల్లార్చిన హర్షాతిరేకం
గబగబా చెట్టెక్కి కూయడం మొదలెడ్తుంది
తన పూలు, కాయల సౌభాగ్యాల్ని
నా కోరికల దోసిట పండించడానికి కాబోలు
ఎనలేని స్వాంతన కలిగించే
ఆమ్లజని నిండిన హదయంతో
చేయందించినపుడు
దాన్ని ఆపన్నహస్తంలా భావిస్తాను
ఒకనాడు గంతులేయించిన బాల్యపు వాకిలి
ఇంకనూ మధురోహల్లో ఊయలలూపుతున్న
చెట్టుకొమ్మవుతుంది
ఇల్లు చిన్నదైనపుడు
వాకిలి విస్తీర్ణం ఆకాశం కన్నా విశాలం
భావ దారిద్య్రానికి చోటివ్వదు
చుట్టూ పచ్చదనాన్ని పోగేసుకొని
సమూహ క్షేమమౌతుంది
ఉదార స్వభావాన్ని పుణికి పుచ్చుకుని
మట్టి మనుషుల్లో కొలువైన అంతరంగ లోగిలి
పల్లె వాకిలి మాత్రమే
ఇంట్లోకీ బయటకూ వెళ్ళినపుడు
ఇష్టమైన పుస్తక పుటల్లో
మనసు తిరగాడినట్లుంటుంది
ఆకాశ పందిరి కింద భూతల్లి ఒడిలో
వాకిలి వేదికపై నేవేసిన అభ్యాస నర్తనలెన్నో
అందరి ఆటవిడుపులకు
అదొక చెరగని చిరునామా
వెలుతురు తలుపులు మూసుకున్నప్పుడు
ఒంటరితనాన్ని కప్పుకొని
నిశ్శబ్దపు కలల్ని కంటుంది
తెల్లారగట్ల కళ్ళను నులుముకొని
మొకం మీద కొన్ని వెలుగు రేఖల్ని చల్లుకొని
ముగ్గులతో సిగ్గులొలక బోస్తుంది
ఇప్పుడు వేగపు దారులు విస్తరించి
ఇరుకైన మనసుతో
వాకిళ్ళను చిన్నచూపు చూసే దశ్యాలెన్నో
అవెందుకు కనుమరుగవుతున్నవో
లేక మన అంతర్ దష్టి మసకేసుకుంటున్నదో
ఏ బాటల్లో ఏ తీరుగ సంచరించినా
మనోదేహం పసితనాన్నెత్తుకుని
జ్ఞాపకాల వాకిట్లో అంబాడుతోంది
- వనిపాకల లచ్చిరెడ్డి , 9966897001