Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇరవైనాలుగు గంటలు
నన్ను గిల్లుతూనో ,గిచ్చుతూనో
నా చుట్టూ తిరిగే పద్యం
ప్రేయసే కదా!
నాలోని ఆనందాన్ని
పచ్చని పైరులాంటి వాక్యంలోకి
నాలోని బాధను
నెర్రెలిచ్చిన భూమిలాంటి
పదాల్లోకి
పట్టి చూపిస్తూ
నా దేహమే తానన్నట్టుగా
నాలోనే కూర్చుంటుంది
పొద్దున్నే తాగే టీ కప్పులోంచి
పొగలు కక్కుతూ
కన్నుగీటుతుంది
మధ్యాహ్నం చేసే భోజనంలోకి
మీగడపెరుగయి
తొంగిచూస్తుంది
సాయంత్రం స్నాక్స్ లా
రాత్రి తినే చపాతీలా
రోజూ నాలో
తేలికగా జీర్ణమవుతూనే ఉంటుంది
బడికెళ్తున్నప్పుడు
బడి నుండి వచ్చేటప్పుడు
రెండు చక్రాల బండిలా
నన్ను అక్షరాల
మోస్తూనే ఉంటుంది
ప్రతిజ్ఞలో
వాక్యమై చుట్టుకుంటుంది
పీరియడ్లో
ఏ పోతన శబ్దాలంకారమో
శ్రీనాథుని సీసపద్యమో అయి వెంటబడుతుంది
హాజరుపట్టికలో అన్నిగడులలో
ఎక్కడా ఏ ఖాళీలేకుండా
తానే నిండి ఉంటుంది
ప్రశ్నాపత్రమయి చేతిలో వాలి
తనలాంటి
ఓ అందమయిన పద్యాన్ని
సమాధానంగా రాయించుకుంటూనే ఉంటుంది
కాసేపు
దారిమధ్యలో ఎదురొచ్చే
పిల్లయేరయి ప్రవహిస్తుంది
నిండుకుండలాంటి చెరువులా
తొణకకుండా బెణకకుండా
నిలబడిచూస్తుంది
బుజబుజపండే సీతాఫలమయి
తీయగా కన్నులు తెరిపిస్తుంది
కన్నీటి చుక్కల్ని
తుడిచే కవితాక్షరమయి
కాగితాన్నో పిడికిలిగా మారుస్తుంది
నాలోనే
నాతోనే ఉంటూ
నిద్రపోనివ్వదు
మెలకువగా ఉండనివ్వదు
నా మెదడును
నా చేతులను
నా కళ్ళను
నా కాళ్ళను
నేను అమితానందంగా ప్రేమించే
నా అంగాంగాన్ని
తనదిగా చేసుకున్న
పద్యాన్ని ఏమనాలి
పద్యం నా లైలా
పద్యం నా అనార్కలి
పద్యమే నా ప్రేయసి
అనకుండా
ఇంకేమనాలి
- తండ హరీష్ గౌడ్
8978439551