Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సామాన్యుడి కలలు
కుట్టేవే కాని భుజం తట్టేవి కావు.
అంతులేని ఆకాశంలో
చావని ఆశలపై దుఃఖ మేఘాలు ఊరేగుతాయి.
రెండుపూటలా తిండి, రెండు బట్టగుడ్డలు
తలదాచుకోవడానికి ఓ చిన్న గూడూ-
ఇంతకు మించి సామాన్యుడు కలలేం కనగలడు.
ఇల్లును కలగనడమంటే
అప్పుల పుట్టలో తలదూర్చడం
సూర్య కిరణాలతో ఒళ్ళు విరుచుకున్న చేతిని
అస్తమయపు గుమ్మంలో ఆకలి నోటికి చేర్చలేని మనిషి
ఇక ఇల్లునేం కలగంటాడు
ఓ చిన్న ఉచ్చ్వాస
భుజం తట్టిన ఓ శుభముహూర్తాన
పిల్లల్ని కన్నంత సులువుగా ఇల్లునైతే కలగంటాడు-
పెళ్లి కావలసిన కూతురు, జీవితంలో స్థిరపడని కొడుకూ కలను వేటాడతారు-
ఇల్లొక ఎడతెగని స్వప్నమౌతుంది.
అరవై వసంతాలు విరబూయాల్సిన చెట్టు
శిశిరాల్ని వెంటేసుకుని కళ్ళముందు తిరుగుతుంటుంది.
ఇల్లు కలను చావుభయం వెంటాడుతుంది
సమాధి లోంచి మొలుచుకొచ్చిన ఆశ
తల తాకట్టు పెట్టడానికి నడుం కడుతోంది.
అప్పులను, కన్నీళ్లను పంచినా
తండ్రిని అనాధ శవం చేశారనే అపకీర్తి
తమ పిల్లలకు రానీయ వద్దని
బలవంతపు ఇల్లుగా మారిపోతాడతను-
మనిషికి లేకున్నా శవానికి ఇల్లు ముఖ్యం కదా!
బంధువుల నందరినీ పిలిచి
ఆనందాన్ని మోసుకొని కొత్త ఇంట్లోకి అడుగు పెడతాడు.
ఆనందం గడ్డకట్టి
హిమాలయమై తలమీద కూర్చుంటుంది.
- కేతిరెడ్డి యాకూబ్ రెడ్డి