Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొందరు మాట్లాడినపుడల్లా
ఒక మంచి ఆలోచనావిత్తును
మదిమడిలో నాటిపోతారు
మాటలు కలబోసుకున్నపుడే కాదు
ఊహల్లోకి వచ్చినపుడల్లా
మమకారపు మేఘపు చినుకులను
వర్షించి వెడతారు
ఎన్నో ఖాళీ క్షణాలను డొల్లబారినతనాలను
ఆత్మీయతతో పూరిస్తూ
ప్రేమపుప్పొడితో
దోసిలంతా నింపుతారు
మన దగ్గర
కొన్నేళ్ళుగా దాచుకున్న
కడవల కొద్దీ కన్నీళ్ళను
ఆవిరి చేస్తూ
తొలకరి నవ్వులతో కళ్ళాపిజల్లి
మనసు ముంగిట్లో
చక్కని మెలికల ముగ్గులేస్తారు
హరివిల్లును తెచ్చి
కిరీటంగా అలంకరించి
ఇంద్రచాపపు రంగులతో
వసంతోత్సవాన్ని జరుపుతారు
దుఃఖపోచలతో
దిగులుకొమ్మలపై అల్లుకున్న
వేదనలగూళ్ళను కూలదోసి
ముత్యాలమువ్వల పల్లకి ఎక్కించి ఊరంతా ఊరేగిస్తారు
నులివెచ్చని తలపుల తలుపులు తీసి
వెన్నెల ఊయలపై కూర్చోపెడుతూ
చందమామను పొట్లం కట్టి
బహూకరిస్తారు
వాళ్ళు స్వచ్ఛమైన
పాలనురుగలాంటి స్నేహంతో
ఆలంబనగా నిలిచి
మనలను పూలతీగను చేస్తారు
వారు ఒకమారు
కనుల ముందు
కదలాడితే చాలు
ఒక అందమైన కవిత
రెక్కలు తపతపలాడిస్తూ
తెల్లని ఆకాశంలోకి
రివ్వున ఎగిరిపోతుంది
- పద్మావతి రాంభక్త, 9966307777