Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అవును వారు గెలిచారు......
ఎత్తిన పిడికిలి దించకుండా
అయిన వారికి దూరంగా
అన్నపానీయాలు మరచి
ఎండావానలను స్వాగతిస్తూ
గడ్డకట్టుకుపోయే చలికే వణుకు పుట్టించి
ముంచెత్తే వానలపై ఆకాశ గొడుగును ఎక్కుపెట్టి
ఎర్రటి ఎండల్లో సూర్యునితో కుస్తీలు పట్టీ
పోలీసుల లాటీలకు ఎదురు నిలిచి
ఎన్ని కష్టాలు ఎదురైనా ఒకటే లక్ష్యంగా
ఏకపక్ష సాగు చట్టాలు వద్దంటూ
పోరాడిన వారు గెలిచారు......
ఏకబిగిన మూడు వందల
ముప్పది మూడు దినాల్లో
ఆరు వందల అరవది తొమ్మిది మంది
అమరుల సాక్షిగా వారు గెలిచారు......
కార్పోరేట్లకు కట్టు బానిసలుగా మారిన
పాలికల పన్నాగాలను భగంచేస్తూ
రాజధాని నడివీధులలో
పాదయాత్రకు పయణమై
కాలినడకతో కథం తొక్కుతూ
కొందరైతే.....
వందలాది ట్రాక్టర్లతో ఇంకొందరు
మడమ తిప్పని మహిళా శక్తుల
మాత ప్రేమల తోడుగా
వారు గెలిచారు......
అవనిపై అవతరించిన ప్రాణకోటికి
జీవం పోసే భూమిపుత్రులు వారు
వారి కంట్లో మన్ను కొట్టాలని చూస్తే
మన నోట్లో మన్ను కొట్టుకోవాలనే
వాస్తవాన్ని మరిచి.....
అబద్దాల కొమ్ము కాస్తు
అన్నదాతపై విషం చిమ్మే
కాలనాగుల కోరలిరిచి
రైతన్నతో తలపడితే
రాజ్యాలే గల్లంతని నినదిస్తూ
భూమాతను ముద్దాడిన
జై కిసాన్‌కు జై అంటూ ఎత్తిన
పిడికిలి సాక్షిగా
వారు గెలిచారు.....!!
- డా|| తాళ్ళపల్లి యాకమ్మ, 9704226681