Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మిన్నును చూస్తుందా స్థలం
రేయిపగలు రెప్పవాల్చని ఆ చూపులు
పచ్చని కాపురానికి కలలధామంగా వెలసి చల్లని నీడయ్యింది
కోరికలు,ఆశలు, ఆనందాల కలబోతగా అందాలగూడయ్యింది
కళకళలాడుతుంది ఆ మమతల లోగిలి...
కాలం కదిలింది క్షణమాగని పెదవాగునదిలా
వేకువ ఝామున
గూటిని వీడుతున్న గువ్వల సందడి మొదలైంది అప్పడే
విధి ఏమీ చెప్పదు
కొడిగట్టిన జీవితానికి అస్తమయం తప్పుతుందా
శోకమయమయం ఇల్లంతా
అనుబంధాల కంట తొణికిన కన్నీరు
దుఃఖసాగరమై పొంగింది
ఆ నేలతల్లి దిక్కులేక తల్లడిల్లింది...
వారసులు అమెరికా ఆకాశమంత ఎత్తుకు ఎదగటమొక ఆనందమూ గర్వమూ
తిమిరాన్ని బాపి వేకువ
ఉషోదయంగా పరివ్యాప్తమైన తీరు
ఆప్తహదయాలన్నీ కదిలాయి ఆ వాకిలిని వదిలి
ఆ గహిణి గుండె ఇప్పుడు బాధల బడబానం
కుప్పకూలుటకు ముందరి గూడుదేమో శక్తిహీనం
మసిబారిన ఆ గదుల్లో దిగులు బూజులు మొలిచాయి
ఎవరూకానరాక కీచురాళ్లూ, బల్లులూ, వాటి తల్లులు అరిచాయి
నాటి సంతోషాలసందడి జాడలేక
ఆ కోవెల వెలవెలబోతుంది
పెచ్చులూడిన ఆ గోపురం దీనంగా చూస్తోంది
ఇల్లు...
టప్పున రాలబోయే పండుటాకు
ఇల్లాలు....
చెరువులో ఎండిన ఓకే ఒక చింతల మాను
నింగినీడలు, నీళ్ల విలవిలలు, చీకటి అలలు తప్ప ఏముంటాయక్కడ
వసంతం కుసుమించని చిరశిశిరం అదికదా
ఆమె ఎదలో....
మునుపటి శిధిలమైన కన్నుల ఆ పాత ఇంటి కధలో ....
ఎడబాటుగీతం పల్లవై పాడుతోంది
మళ్ళీ అక్కడ వెలయనుంది ఆధునికహంగుల పాలరాతి భవనం బహుశా
వేనవేల జ్ఞాపకాలు
దాగుడుమూతలు ఆడుకున్న గోడల్ని
ఆ నాటి నిర్మలమైన మమతల నీడల్ని
నేల కూల్చి వేయబడి
ఏన్నో జీవితాలను వెలిగించిన ఆ డాబా కనుమరుగయ్యింది
శతాబ్దాల గుర్తుల్ని తన గర్భంలో దాచుకొని
యూటర్న్ గా
ఆ ఖాళీ స్థలం నగంగా ఇన్నాళ్లకు మరలా అందరికీ కనిపిస్తుంది
అనంతాకాశాన్ని మౌనంగానే చూస్తుంది
అవే చూపులు...
దాని చూపుల్లో.....
ఒక కుటుంబాన్ని....
వారి కష్టసుఖాల ప్రతిబింబాల్ని పొదువుకున్నట్లుంది
నూరేళ్ళ జ్ఞాపకాలు దొంతరలై దొర్లుతున్నాయి....
స్థలమంటే స్థలమే
అది వొట్టి ఖాళీస్థలమని ఎవరైనా అంటే
దాని చూపుల్లో మగమయిన
నేనెలా ఒప్పుకుంటాను.
- నల్లగొండ, 8309452179