Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భూగోళమంతటా గిరులే !
చిన్నవి.. పెద్దవి.. ప్రాచీనమైనవి.. పవిత్రమైనవి..
కాలం తొలి సంతకం నాటిPangea నుండి
Continental Drift పుణ్యమా అని
ఖండాలంతటా గిరుల శ్రేణులే...
అచలాలు, అద్రులు, కొండలు, గుట్టలు,hills
పహాడ్, పర్వతాలు, శిఖరాలు, mountains
హిమాలయాలు, కాంచన్ జంగ, నందాదేవి, ఆరావళి, నీలగిరి..
కిలిమంజారో, ఎల్ బ్రస్, ఆకాంకగువా,
రష్ మోర్, ఫుజియామా..
పేరేదైతేనెం అవన్నీ
భౌమ రేఖ నుండి నిలువుగా
నేల గుండెలమీద లంబకోణంలో ఎదిగినవే కదా !
అయితే, అన్ని గిరులూ ఒకటి కావు !
కొన్ని మట్టిని -పచ్చని వనాలను ఒళ్లంతా నింపుకుంటాయి..
కొన్ని శిలలు- రాళ్లను ఆభరణాలుగా ధరిస్తాయి..
కొన్ని మంచు దుప్పటిలో కూరుకుపోతాయి..
కొన్ని ఇసుకమేటలను ఎదలపై పరచుకుంటాయి...
ఇంకొన్ని రాళ్ళు- వనాలతో
మంచు- వక్షాలతో
వాన - సతత హరితారణ్యాలతో
జమిలిగా జుగల్ బందీ గానాన్ని ప్రదర్శిస్తాయి!
నువ్వు గమనించావో లేదో
ఈ ప్రపంచంలో ఏ గిరులూ మరో గిరులలా ఉండవు!
వేటికవే ప్రత్యేకం - విభిన్నం
వేటికవే వైవిధ్యం- విశిష్టం !
నిర్మాణంలో - ఆకారంలో
రూపంలో -స్వభావంలో ఏవీ మరోలా ఉండవు
మనుషులలానే...
No two individuals are alike in this world..
No two hills are similar on this earth..
అందుకేనేమో-
అరణ్యాల కన్నా గిరులపైనే నాకు మహా ఆసక్తి
అనాది కాలపు ఆదిమ సహజాతమో
అంతశ్చేతన లోని అధిరోహణా లాలసనో తెలీదు
కానీ గిరులు ఎప్పుడూ నాకు aశ్రీశ్రీబతీఱఅస్త్రగానే ఉంటాయి!
అయినా గిరులే భూమికి special attraction !
అసలు భూమి సౌందర్యమంతా
గిరుల ఆకతిలోనూ
వాటిలోని ఎత్తు పల్లాలలోనూ దాగి ఉంటుంది అనుకుంటా
లేకపోతే ఎప్పుడూ నేలబారుగా ఉండే భూమికి
ఆ అందం ఎక్కడిది?
అయినా, గిరులు అంటే-
పాదపీఠం నుండి మొదలుకొని శిఖరం దాకా
అర్థ వత్తంలోనో, త్రికోణంలోనో రూపొంది
మట్టి నుండి ఆకాశం వంక చూపులు విసిరే
ప్రకతి బింబాలు కదా !
దూరం నుంచి నునుపుగా కనిపించినా
దగ్గరకు వెళ్తే తప్ప అర్థం కాని మార్మిక ప్రదేశాలు కదా !
పిరమిడ్ ఆకారంలో
పీఠం నుండి ఊర్ధ్వ దిశగా
స్వర్గలోకానికి దారి చూపే మంత్ర సూచికలు కదా!
అందుకే నేను గిరులను కళ్ళతో స్పర్శిస్తూ
నేల మీదుగా గిరి ప్రదక్షిణం చేసి
ఏదో ఒక దిశ నుండి శిఖరం వైపు ఎక్కడం మొదలెడతాను
అన్ని గిరులనూ ఒక్కలా చూడలేను..
ఒకేలా ఎక్కలేను
ఒకే గిరి పై సైతం రెండు సార్లు ఒకేలా నడవలేను..
గిరులు-
నిగూఢ శిలలు- నా అంతర్ యాత్రకు నెలవులు-
బహిర్లోక మర్మాలు- నా ఆత్మావిష్కరణ కొలువులు
ఆధ్యాత్మిక నిధులు- నా ప్రశాంతి నిలయాలు !
ఇప్పుడు నేను,
ప్రస్థానాన్ని సాగించడం తప్ప ప్రకటనలు చేయలేను
అన్వేషిస్తూ వెళ్లడం తప్ప ఆదేశాలు ఇవ్వలేను !
ఈ గిరుల సానువుల వెంట నాది ఒక మహాయానం!
నేను తడబడతాను.. తప్పి పోతాను .. జారిపోతాను
పడిపోతాను.. పరుగులు పెడతాను
ఏ ఊతనో తీసుకుని నిలబడి మళ్ళీ ఎక్కుతాను
Zenith, Top, Paramount అంటావ్ కదా నువ్వుు
ఆ దిక్కుగా పాదాలకు రెక్కలు తొడుగుతాను..
ఇన్ని సంచారాల తర్వాత
ఇన్ని ఘటనల తర్వాత
నా చేతుల్లో అదశ్యమయ్యే గిరులు
నా చేతుల్లో ఒదగక అతిక్రమించే గిరులు
నా చేతుల మధ్య నిండుగా ఇమిడిపోయే గిరులేవో
తెలుసుకుంటాను
ఇక నీలగిరులలో నన్ను నేను వెతుక్కోవడానికి
అనాది ఆత్మ ప్రదక్షిణా యాత్రను మొదలు పెడతాను...!
- మామిడి హరికష్ణ, 8008005231